సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని 15 నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ముసాయిదా జాబితాలో తమ పేర్లు, పోలింగ్ కేంద్ర వివరాలను సరి చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సూచించారు. సోమవారం నియోజకవర్గాల ఓటర్ల ముసాయిదా జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్) విడుదలైందని, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)- 2026 కార్యక్రమంలో భాగంగా ఈ ముసాయిదా జాబితాను ఆయా నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఈఆర్ఓ) కార్యాలయాలు, ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు.
ఈ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) అధికారిక వెబ్ సైట్ www.ceotelangana.nic.in లో కూడా అందుబాటులో ఉంచినట్లు పేరొన్నారు. జాబితాలో ఎలాంటి మార్పులు, చేర్పులు, సవరణలు లేదా అభ్యంతరాలు ఉన్నా వాటికి సంబంధించిన ఫారమ్‌లతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కొత్తగా ఓటరుగా నమోదుకు ఫారం-6, పేరు తొలగింపుకు ఫారం-7, చిరునామా, వివరాల సవరణకు ఫారం-8 ద్వారా డిక్లరేషన్ తో సహా దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు.సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్ఓ), ఈఆర్ఓ కార్యాలయంలో గాని, ఈసీఐ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో గాని వచ్చే నెల 16వ తేదీలోగా తమ దరఖాస్తులు, అభ్యంతరాలను సమర్పించాలని కర్ణన్ విజ్ఞప్తి చేశారు.