వికారాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : జిల్లా వ్యవసాయ శాఖ అక్రమ దందాలకు అడ్డాగా మారిందనే ప్రచారం జరుగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు ప్రతీ విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకు అక్రమార్కులు నకిలీని సృష్టించి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఇంత జరిగినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడం గమనార్హం. జిల్లాలో వెలుగులోకి వచ్చిన నకిలీ విత్తనాలతోపాటు సబ్సిడీ విత్తనాల స్వాహా, నకిలీ ఎరువుల వ్యవహారం వెనుక కొందరు వ్యవసాయాధికారుల హస్తముందని పోలీసుల విచారణలో బయటపడినా.. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న అన్నదాతలకు అకాల వర్షాలు, సరైన మద్దతు ధర లేకపోవడంతోపాటు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులతో నష్టాలే మిగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కనీసం పెట్టుబడి సాయాన్ని కూడా పొందలేని దుస్థితిలో అర్హులైన రైతులున్నారు. నకిలీ పత్తి విత్తనాలు, ఎరువుల బారిన పడిన అన్నదాతలు పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలను కూడా చెల్లించలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పత్తి రైతులు విత్తనాలు, ఎరువులు మొదలుకొని పత్తిని విక్రయించే వరకు మోసపోతున్నారు.
వెలుగులోకి నకిలీ డీఏపీ దందా
ఈ ఏడాది జిల్లాలోని పూడూరులో 176 నకిలీ డీఏపీ బస్తాలు, పరిగి మండలంలో 24, బంట్వారం మండలంలో 49, యాలాల మండలంలో 30 బస్తాలను వ్యవసాయ, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పరిగి మండలంలోని లఖ్నాపూర్, చిగురాల్‌పల్లి, బసిరెడ్డిపల్లి, పూడూరు మండలంలోని మంచన్‌పల్లి, బంట్వారం మండలంలోని రొంపల్లిలో, యాలాల మండలంలో నకిలీ డీఏపీ బస్తాలను చాలా మంది అన్నదాతలు కొనుగోలు చేశారు. గ్రామాల్లోకి వెళ్లి రూ.1700లకు ఒక బస్తా డీఏపీ ఇంటి వద్దకు తెచ్చి ఇస్తామంటూ చెప్పి నమ్మించి రైతులకు నకిలీ డీఏపీని అంటగట్టి మోసం చేశారు.
నకిలీ డీఏపీని పంట పొలాల్లో వేస్తుండగా చేతులకు మంటలు, బొబ్బలు రావడం, నాలుగైదు రోజులైనా అస్సలు కరగకపోవడాన్ని గుర్తించిన అన్నదాతలు వ్యవసాయాధికారులకు సమాచారమివ్వడంతో నకిలీ డీఏపీ బాగోతం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నకిలీ డీఏపీని కేవలం బంకమట్టి గుళికలతోనే తయారు చేసినట్లు అధికారుల నివేదికలో స్పష్టమైంది. డోలమైట్‌పై 18 శాతం నత్రజని, 46 శాతం భాస్వరం మిశ్రమంతో డీఏపీని తయారు చేస్తారు. కానీ నకిలీ డీఏపీలో మాత్రం అధిక శాతం బంకమట్టి ఉన్నట్లు, కేవలం 1 శాతం నత్రజని, 3 శాతం భాస్వరం ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్‌లో తేలింది. నకిలీ డీఏపీలో ఏ ఫార్ములా లేకుండానే బంక మట్టి గుళికలపై నత్రజని, భాస్వరం పూతతో తయారు చేసినట్లు తేలిపోయింది.
మరోవైపు నకిలీ డీఏపీ వ్యవహారంలో జిల్లా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని పరిగి, పూడూరు, బంట్వారం, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీని స్వాధీనం చేసుకొని పదిహేను రోజులు దాటినా ఇప్పటివరకు నకిలీ డీఏపీకి సంబంధించి చిన్న సమాచారం కూడా పోలీసులు రాబట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ డీఏపీని ఎక్కడ తయారు చేశారు, తయారు చేసే కంపెనీని ఎక్కడ ఏర్పాటు చేశారు, నకిలీ డీఏపీ వ్యవహారం వెనుక అసలు నిందితులెవరున్నారనే దానిపై పోలీసులు అడుగు ముందుకు వేయకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ డీఏపీని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసిన పోలీసులు.. కేవలం ఓ డీలర్, ట్రాన్స్పోర్ట్ చేసిన వ్యక్తిని మాత్రమే రిమాండ్ చేసి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సబ్సిడీ విత్తనాలు పక్కదారి
చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల పంటలను ప్రోత్సహించడంతోపాటు రైతులకు విత్తనాల కొనుగోలు చేసే భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీపై ప్రభుత్వం అందజేసిన విత్తనాలను జిల్లాలో పూర్తిగా పక్కదారి పట్టించిన అక్రమ దందా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అన్నదాతలకు సబ్సిడీపై విత్తనాలను అందజేసేందుకు వంద శాతం రాయితీతోపాటు 45 శాతం రాయితీ విత్తనాలను జిల్లాకు సర్కారు పంపిణీ చేసింది. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మండలాలతోపాటు తాండూరు నియోజకవర్గ పరిధిలోని బషీరాబాద్ మండలం, వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంట్వారం మండలం, పరిగి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సబ్సిడీపై యాసంగి సీజన్లో వేరుశనగ విత్తనాలను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
సంబంధిత మండలాలకు రూ.60 లక్షల విలువైన 900 క్వింటాళ్లను అందజేయాల్సి ఉండగా, ఏ ఒక్క రైతుకు కూడా సబ్సిడీ విత్తనాలు అందకుండానే వ్యవసాయాధికారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి అందినకాడికి దోచుకున్నారు. రెండు పథకాల కింద 45 శాతం సబ్సిడీతోపాటు వంద శాతం సబ్సిడీ కింద జిల్లాకు వేరుశనగ విత్తనాలు రాగా, ఆయా మండలాల ఏఈవో, ఏవోలు అందజేసినట్లు చూపిస్తున్నా ఏ ఒక్క రైతుకు కూడా సబ్సిడీ విత్తనాలు అందకపోవడం గమనార్హం. అధిక మొత్తంలో సబ్సిడీ విత్తనాలు వచ్చిన కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాల్లో సబ్సిడీ విత్తనాలను దారి మళ్లించి అక్రమార్జనకు పాల్పడ్డారని ఆయా మండలాల వ్యవసాయాధికారులపై తేలగా పలువురిపై వేటు పడినప్పటికీ, ఒకరిద్దరిని సంబంధిత శాఖలోని ఓ అధికారి అండగా నిలిచి కాపాడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది.
ప్రతి ఏటా నకిలీ విత్తనాల దందా
జిల్లాలోని కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతున్నప్పటికీ నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నకిలీ పత్తి విత్తనాల ముఠా కర్నాటక సరిహద్దు కేంద్రంగా నడిపిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు కర్నాటక రాష్ట్రం సరిహద్దు ప్రాంతమైన సేడం, గుల్బర్గా ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరిలో కొంతమంది నకిలీ పత్తి విత్తనాల దందాను నడిపిస్తూ అక్రమంగా జిల్లాకు నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని గత ఐదారేళ్లుగా కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో పట్టుబడినవారంతా సేడం, గుల్బర్గా ప్రాంతంలో ఉంటున్న ఆంధ్ర ప్రాంతంవారే కావడం గమనార్హం. నకిలీ పత్తి విత్తనాల దందాను నడిపిస్తున్న వారి వివరాలు తెలిసినప్పటికీ కేవలం వారి వద్ద లభించిన నకిలీ విత్తనాలను మాత్రమే సీజ్ చేస్తూ జిల్లాకు అక్రమంగా నకిలీ విత్తనాల తరలింపును మాత్రం అడ్డుకట్ట వేయడం లేదనే విమర్శలు పోలీసులపై వినిపిస్తున్నాయి.
ప్రతి ఏటా కర్నాటక నుంచి జిల్లాకు వందల క్వింటాళ్లలో నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. జిల్లాలో 2019 నుంచి ఇప్పటివరకు అధికారికంగా 200 క్వింటాళ్ల వరకు నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసినప్పటికీ.. గుట్టుచప్పుడు కాకుండా వందల క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను జిల్లాకు అక్రమంగా తరలిస్తూ అమాయక రైతులకు విక్రయిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది కొడంగల్ నియోజకవర్గం రావులపల్లి చెక్‌పోస్ట్ వద్ద యాద్గిర్ జిల్లాలో నివాసముంటున్న ఉప్పలపాటి వసంతరావు అనే వ్యక్తి నుంచి 2.5 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూనకాల సురేశ్ తదితరుల నుంచి 4.2 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ విత్తనాల వ్యవహారం వెనుక కూడా పలువురు వ్యవసాయాధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నదనే ఆరోపణలున్నాయి.
నకిలీ పత్తి విత్తనాలు సీజ్
సంవత్సరం : క్వింటాళ్లు
2019 : 47.97
2020 : 4.07
2021 : 85.72
2022 : 24.64
2023 : 11.45
2024 : 64
2025 : 30