సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో కేడర్ రూల్స్, సీనియారిటీని తుంగలో తొకుతూ కొందరు అధికారులకు కొమ్ముకాస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అర్హులైన సీనియర్ అధికారులను పకన పెట్టి, జూనియర్లకు అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కట్టబెడుతుండటంపై ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 15 సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ) పోస్టులు ఉండగా, అందులో 13 పోస్టులు పబ్లిక్ హెల్త్ (పీహెచ్) విభాగానికి, 2 పోస్టులు జీహెచ్ఎంసీ కేడర్‌కు కేటాయించబడ్డాయి.
అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ కేడర్‌కు చెందిన ముగ్గురు అధికారులకు ఎస్ఈ (ఎఫ్ఏసీ) బాధ్యతలు కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం పబ్లిక్ హెల్త్ విభాగం నుంచి 2016 బ్యాచ్‌నకు చెందిన సీనియర్ ఈఈలు ఆర్ శివానంద్, రామును జీహెచ్ఎంసీలో ఈఈలుగా పోస్టింగ్ ఇచ్చారు. ఖాళీగా ఉన్న ఎస్ఈ (ఎస్డబ్ల్యూఎం), ఎస్ఈ గోల్కొండ పోస్టుల్లో వీరిని నియమించాల్సి ఉండగా, వారిని పకనబెట్టి జీహెచ్ఎంసీ కేడర్ ఈఈలకే రెండేసి ఎస్ఈ పోస్టుల బాధ్యతలను అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
త్వరలోనే జనరల్ బాడీ సమావేశం నిర్వహించి ఈఎన్సీ తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాలు, మూడు కార్పొరేషన్లలో పోస్టింగ్‌ల విషయంలో సీనియారిటీ పాటించకుండా కమిషనర్లు వ్యవహరిస్తున్న తీరుపై చర్చించాలని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీనియర్లను కాదని అనర్హుడు దొడ్డిదారిన ఈఎన్సీ సీట్లో కూర్చోవడంతోనే తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని, ఎస్ఈ హోదాలో తనకన్నా పలువురు సీనియర్లు ఉన్నా..డీఈఈ కేడర్లోనే తానే సీనియర్‌నంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అడ్డదారిలో భాస్కర్‌రెడ్డి ఈఎన్సీ దక్కించుకున్నాడని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తననూ, తన మొత్తం కార్యవర్గాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో గెలిపించిన తమ అసోసియేషన్ సభ్యుల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటం చేయడం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలను పట్టించుకోనని శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.