న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున వెనుకకు తీసుకుంటున్నారు. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దాదాపు రూ.2.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఎఫ్ఐఐలు ఉపసంహరించుకున్నారు. గత ఏడాది రూ.2.39 లక్షల కోట్లు వెనక్కి తీసుకోగా.. 2024లో రూ.1.28 లక్షల కోట్లు తరలిపోయాయి. అయితే 2025లో సుమారు రూ.74,000 కోట్లు, 2024లో దాదాపు రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులనూ తీసుకొచ్చారు. దీంతో నిరుడు రూ.1.65 లక్షల కోట్లు, అంతకుముందు ఏడాది రూ.7,000 కోట్లు పడిపోయినైట్టెంది. ఈ ఏడాది ఇది ఏకంగా రూ.2.33 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. రూ.47,000 తిరిగి తెచ్చారు మరి.
స్టాక్ మార్కెట్లలో ఇప్పటికే నమోదైన సంస్థల్లో నుంచి పెట్టుబడులను లాగేసుకునే పనిలోపడ్డ ఎఫ్ఐఐలు.. కొత్తగా నమోదవుతున్న కంపెనీలపట్ల మాత్రం ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో)లో రూ.47,000 కోట్ల పెట్టుబడులను పెట్టడం ఇందుకు నిదర్శనం. నూతన రంగాల్లోకి ప్రవేశించాలన్న కోరికతోపాటు, షేర్ల ధరలు తక్కువగా ఉండటంతో మెజారిటీ ఎఫ్ఐఐలు ఇప్పుడు పాత షేర్లను అమ్ముకుని కొత్త షేర్లను చౌకగా దక్కించుకోవడంపైనే దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులకు మార్కెట్ లిస్టెడ్ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం, అమ్మకాల ఒత్తిడికి గురవుతుండటం.. ఇన్వెస్టర్లకు నష్టాలను మిగులుస్తున్నాయి. దీంతోనే నయా కంపెనీలపై ఆసక్తి కనబరుస్తున్నారని మార్కెట్ నిపుణులు ప్రస్తుత ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
ఎఫ్ఐఐలు భారతీయ స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్, ఐటీ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ రంగాల్లో వృద్ధి పరిమితంగానే తయారైంది. దీంతో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, కన్జ్యూమర్ టెక్నాలజీ, రెన్యువబుల్స్, క్యాపిటల్ మార్కెట్ వ్యాపారాల్లో పెట్టుబడులపై దృష్టిసారిస్తున్నారు. అందుకే ఈ రంగాలకు చెందిన సంస్థలు ఐపీవోలకు వచ్చినప్పుడు భారీగా షేర్ల కొనుగోలుకు దిగుతున్నారని ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. ఇక త్వరలో జియో ప్లాట్‌ఫామ్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ), ఫోన్‌పే, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ పబ్లిక్ ఇష్యూలు రాబోతున్నాయి. దీంతో మార్కెట్ చూపంతా వీటిపైనే ఉన్నదిప్పుడు.
ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య ఆర్థిక సేవల రంగం నుంచి లక్ష కోట్లు దాటిన ఎఫ్ఐఐలు ఉపసంహరించుకున్న పెట్టుబడుల విలువ.ఆటో, చమురు-గ్యాస్, ఎఫ్ఎంసీజీ, టెలికాం, ఐటీ రంగాల నుంచి రూ.25,000 కోట్ల చొప్పున తరలిపోయిన పెట్టుబడులు.
గల్ఫ్ వార్ , ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల దెబ్బ
వెంటాడుతున్న ఎల్ నినో, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, కొనుగోలు శక్తి మందగమనం భయాలు.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం పొందిన, దరఖాస్తు చేసుకున్న ఐపీవోల విలువ రూ.4.7 లక్షల కోట్ల పైమాటే.
ఈ జనవరి-ఆగస్టులో పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.72,000 కోట్ల నిధులను అందుకున్న కంపెనీలు.
ఎక్కువ ధరల్లో ఉన్న పాత షేర్లను అమ్ముకుని తక్కువ ధరకు వస్తున్న కొత్త షేర్లను కొంటున్నారు విదేశీ మదుపర్లు. ఈ క్రమంలోనే ఐపీవోలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
-రాజ్ గైకర్, సామ్కో సెక్యూరిటీస్
యాంకర్ లేదా క్యూఐబీ కేటాయింపులు నిర్దిష్ట, సరసమైన ధరల శ్రేణిలో జరుగుతున్నాయి. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఐపీవోల్లోకి మళ్లిస్తున్నారు.
-తన్వి కాంచన్, ఆనంద్ రాఠీ షేర్స్