Darren Bravo : వెస్టిండీస్ క్రికెట్లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ఇంగ్లండ్ పర్యటన(England Tour)కు ఎంపిక చేయకపోవడంతో ఆగ్రహంతో ఉన్న డారెన్ బ్రావో(Darren Bravo) ఇకపై దేశం తరఫున ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ తన నిర్ణయాన్ని సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు తనను పక్కన పెట్టిన సెలెక్టర్లు కనీస సమాచారం ఇవ్వలేదని, తనను చిమ్మ చీకట్లో వదిలేశారని అన్నాడు.
‘ప్రస్తుత సమయంలో ఆటలో కొనసాగాలంటే మరింత శక్తి కావాలి. అంతర్జాతీయ క్రికెట్లో నా శక్తిసామర్ధ్యం మేరకు రాణించేందుకు టైమ్ పడుతుంది. మూడు ఫార్మాట్లలో 40- 45 మంది ఆటగాళ్లు అవసరం. కానీ, వీళ్లలో నేను లేకపోవడం బాధాకరం. ప్రాంతీయ టోర్నీల్లో పరుగులు సాధించినా సెలెక్టర్లు నన్ను పక్కన పెట్టేశారు. అలాగని నేను ఆశలు వదిలేయడం లేదు. ప్రతిభావంతుడైన యువకుడికి అవకాశం కల్పిస్తున్నా. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. నేను నా కలను నిజం చేసుకున్నాను’ అని బ్రావో భావోద్వేగంతో రాసకొచ్చాడు.
గత నాలుగేండ్ల కాలంలో బ్రావో నిలకడగా రాణిస్తున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లో 96.2, 65.0, 48, 83.2 సగటుతో బ్యాటింగ్ చేశాడు. అంతేకాదు ఈమధ్యే స్వదేశంలో జరిగిన సీజీ యూనైటెడ్ సూపర్ 50లో రెడ్ ఫోర్స్(Red Force) జట్టు విజేతగా నిలవడంలో బ్రావో పాత్ర ఎనలేనిది. ఈ టోర్నీలో చితక్కొట్టిన అతడు 416 రన్స్‌తో గోల్డెన్ బ్యాట్ అందుకున్నాడు. అయినా కూడా సెలెక్టర్లు అతడికి మొండిచేయి చూపడంతో బ్రావో తీవ్ర నిరాశకు గురయ్యాడు.
డారెన్ బ్రావో
ఇక విండీస్ క్రికెట్ బోర్డుతో తెగతెంపులు చేసుకోవాలని అతడు భావిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టు వన్డే, టీ20ల కోసం డిసెంబర్లో వెస్టిండీస్‌కు రానుంది. దాంతో, సెలెక్టర్లు ఈమధ్యే షై హోప్ కెప్టెన్‌గా 15మందితో కూడిన బృందాన్ని ప్రకటించారు. డిసెంబర్ 3న తొలి వన్డే జరగనుండగా.. డిసెంబర్ 13న తొలి టీ20 నిర్వహించనున్నారు.
విండీస్ వన్డే స్క్వాడ్ : షై హోప్(కెప్టెన్), అల్జారీ జోసెఫ్(వైస్ కెప్టెన్), అలిక్ అథనజె, యన్నిక్ కరియా, కేసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, మాథ్యూ ఫోర్డే, షిమ్రన్ హెట్‌మైర్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోటీ, జొర్న్ ఒట్లే, షెర్ఫనే రూథర్‌ఫర్డ్, రొమరియో షెఫర్డ్, ఒషానే థామస్.