CM KCR | రైతు కష్టం.. వ్యవసాయ రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ మాత్రమేనని అంటున్నారు కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు పీ చెంగల్‌రెడ్డి. కాంగ్రెస్, బీజేపీలు అన్నదాతకు నమ్మకద్రోహం చేస్తే.. కేసీఆర్ మాత్రం అండగా నిలబడ్డారని, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారని అంటున్నారు. దేశ రైతాంగానికి కేసీఆర్ ఆశాకిరణమని, ఆయన మాత్రమే దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలరని చెప్తున్నారు. రైతాంగమంతా కేసీఆర్ వెంట నడవాల్సిన తరుణమిదని పిలుపునిస్తున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ‘నమస్తే తెలంగాణ’తో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
తెలంగాణ వ్యవసాయ రంగంలో ఈ పదేండ్లలో మీరు చూసిన మార్పులేంటి ?
వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ పునర్నిర్మించారు. రైతు పక్షపాతిగా రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారు. రైతాంగానికి 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తు సరఫరా అవుతున్నది. రైతుబంధు పథకంతో కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. రుణమాఫీ చేస్తున్నది. ఇవన్నీ రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. కాళేశ్వరం ద్వారా 60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతున్నది. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా.. ఎకరం కనీసం రూ.15-20 లక్షలు పలుకుతున్నది. గతంలో సాగునీరు లేక ఇక్కడి రైతులు వలసలు వెళ్లేవాళ్లు. ఇప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి వ్యవసాయ పనుల కోసం తెలంగాణకు వలస వస్తున్నారు. ఇవన్నీ ఈ పదేండ్లలో వచ్చిన మార్పులే. తెలంగాణ వ్యవసాయ మాడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.
దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీ ఎలా పని చేస్తున్నాయి ?
కాంగ్రెస్, బీజేపీలు రెండూ అన్నదాతలకు నమ్మకద్రోహం చేస్తున్నాయి. వ్యవసాయ రంగానికి మేలు చేసేలా ఆ పార్టీలు పని చేయడం లేదు. దేశంలో సుమారు 254 చక్కెర కర్మాగారాలు మూతబడ్డాయి. చక్కెర నుంచి ఇథైల్ ఆల్కహాల్ తయారీపై కేంద్రం దృష్టి పెట్టి ఉంటే ఇలా మూతపడేవి కాదు. లాబీయింగ్‌కు తలొగ్గకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగేది కేసీఆర్ మాత్రమే. ఆయనకు మాత్రమే వ్యవసాయం, రైతాంగంపై సంపూర్ణ అవగాహన ఉన్నది. జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగానికి మేలు చేసేలా గుండె ధైర్యంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశగా కేసీఆర్ కీలకపాత్ర పోషించగలరు. దేశంలో వ్యవసాయ సమస్యలపై కేసీఆర్ ఒక్కరే మాట్లాడుతున్నారు. ప్రపంచంతో మన దేశ వ్యవసాయం రంగం పోటీ పడేలా కేసీఆర్ చేయగలరని విశ్వసిస్తున్నా.
అన్ని వనరులున్నా మన దేశం వ్యవసాయంలో వెనుకబడటానికి కారణాలేంటి ?
దేశంలో వ్యవసాయరంగం అంత సవ్యంగా లేకపోవడానికి ప్రధాన కారణం.. ప్రభుత్వాల పాలసీలు విఫలమవ్వడమే. ఇజ్రాయెల్‌లో సరైన పాలసీలతోనే రైతులు విజయాన్ని సాధించారు. తెలంగాణలో వ్యవసాయ దిగుబడులు పెరిగేలా కేసీఆర్ మంచి విధానాలను రూపొందించారు. ఈ దిశగానే దేశంలోనూ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం సరైన పాలసీలను రూపొందించాలి. జెనెటిక్ టెక్నాలజీ వంటి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటే భారతదేశం వ్యవసాయంలో చైనా, అమెరికాలతో పోటీ పడగలదు. ఈ దిశగా నిర్ణయాలు తీసుకోగలిగేది, రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను శాశ్వతంగా పరిష్కరించగలిగే విజన్ కేసీఆర్‌కు ఉన్నది.
తెలంగాణ రైతాంగానికి మీరు చేసే సూచనలు ?
కేసీఆర్ చేసిన సంస్కరణల వల్ల తెలంగాణ రైతాంగానికి సామాజికంగా గుర్తింపు దక్కింది. రైతులు ఆర్థికంగా బలపడ్డారు. ఇందుకు కృతజ్ఞతగా ఇప్పుడు యావత్తు రైతాంగం సీఎం కేసీఆర్ వెంట నడవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ మూడోసారి గెలిస్తే అది వ్యవసాయ రంగం సాధించే గెలుపు అవుతుంది. దేశంలోనూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడానికి కేసీఆర్ సాధించబోయే విజయం దోహదపడుతుంది.
…?ఎక్కల్దేవి శ్రీనివాస్