దాయాదుల పోరు ఉర్రూతలూగిస్తుందని భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులను.. వన్డే ప్రపంచకప్‌లో మెగాఫైట్ ఊసూరు మనిపించింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య వైరం వీక్షించేందుకు మైదానానికి విచ్చేసిన లక్ష మంది అభిమానులతో పాటు.. టీవీల్లో చూస్తున్న కోట్లాది మందిని పాకిస్థాన్ జట్టు తీవ్రంగా నిరాశ పరిచింది!
కనీస ప్రతిఘటన లేకుండా.. ఏమాత్రం పోటీ నివ్వకుండా పాక్ చేతులెత్తేయడంతో.. రోహిత్ మెరుపులు తప్ప మ్యాచ్‌లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై అసలు బ్యాటింగే రానట్లు పాక్ మిడిలార్డర్ పేకమేడను తలపిస్తే.. బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్ బృందం అహ్మదాబాద్‌లో వీర విహారం చేసింది!!
అంతర్జాతీయ క్రికెట్లో తమ జట్టును అనిశ్చితికి మారుపేరని ఎందుకంటారో పాక్ మరోమారు నిరూపించింది! ఒక దశలో 155/2తో పటిష్టంగా కనిపించిన బాబర్ సేన.. ఆ తర్వాత కేవలం 36 పరుగుల వ్యవధిలో మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయి కుప్పకూలితే.. తొలి బంతి నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడిన హిట్‌మ్యాన్.. లక్ష్యాన్ని తేలిక చేసేశాడు.
కోహ్లీ, గిల్ ఎక్కువ సేపు నిలువలేకపోయినా.. రాహుల్‌తో కలిసి శ్రేయస్ మిగిలిన పని పూర్తి చేశాడు!లక్ష మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో పూర్తి ఏకపక్షంగా సాగిన ప్రపంచ కప్ పోరులో ఎనిమిదోసారి పాకిస్థాన్‌ను పాతరేసిన టీమిండియా పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది!!
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ జోరు కొనసాగింది. ఇప్పటి వరకు జరిగిన ఏడు వరల్డ్‌కప్‌లలో దాయాదిని చిత్తుచేసిన టీమ్ఇండియా.. ఎనిమిదోసారి కూడా అదే ఫలితం రాబట్టింది. శనివారం జరిగిన మెగా పోరులో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. మెగాటోర్నీలో భారత్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా.. ఈ ఫలితంతో టీమ్ఇండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. మొదట పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన భారత్.. అనంతరం భారీ షాట్లతో విరుచుకుపడి చూస్తుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ బాబర్ ఆజమ్ (50; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మహమ్మద్ రిజ్వాన్ (49; 7 ఫోర్లు), ఇమాముల్ హక్ (36; 6 ఫోర్లు) పర్వాలేదనిపించారు. ఒక దశలో 155/2తో పటిష్ట స్థితిలో కనిపించిన పాక్.. మన బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మరో 36 పరుగుల జోడించి చాపచుట్టేసింది. సౌద్ షకీల్ (6), ఇఫ్తిఖార్ అహ్మద్ (4), షాదాబ్ ఖాన్ (2), మహమ్మద్ నవాజ్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా బుమ్రా బుల్లెట్ యార్కర్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
సారథి రోహిత్ శర్మ (63 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) పాక్ బౌలర్లను ఊచకోత కోయగా.. శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో సత్తాచాటాడు. శుభ్‌మన్ గిల్ (16; 4 ఫోర్లు), విరాట్ కోహ్లీ (16; 3 ఫోర్లు) ఎక్కువ సేపు నిలువకపోయినా.. స్వల్ప ఛేదనలో రోహిత్ దంచుడు ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 2 వికెట్లు పడగొట్టాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. వరల్డ్‌కప్‌లో భాగంగా తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.
ఈ ఘనత బౌలర్లకే దక్కుతుంది. ఇది 190 పరుగుల పిచ్ అని నేనైతే అనుకోలేదు. దాదాపు మూడొందల పరుగులు చేస్తారనుకున్నాం. కానీ మా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. వారి ఆటతీరుతో గర్వంగా ఉంది. ఈ ఒక్క విజయంతో పొంగిపోవడం లేదు. ఈ జోరును ఇక ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నాం. బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టు సమతూకంగా ఉంది.
-రోహిత్, భారత కెప్టెన్
అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్.. మరోమారు తమ డొల్లతనాన్ని బయట పెట్టుకుంది. నీలి రంగు పులుముకున్న అహ్మదాబాద్ స్టేడియంలో అడుగుపెట్టడానికి ముందే మానసికంగా కుంగిపోయిన బాబర్ సేన.. మైదానంలో బ్యాటింగ్, బౌలింగ్‌లో దాన్నే ప్రస్ఫుటించింది. మంచి ఆరంభం లభించిన అనంతరం సైకిల్ స్టాండ్‌ను తలపిస్తూ.. మిడిలార్డర్ ఆటగాళ్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కడితే.. బౌలింగ్‌లో మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నా.. వాటిని సరైన దిశలో ఉపయోగించుకులోకపోయింది. వన్డేల్లో భారత్‌పై మంచి రికార్డు ఉన్న పాక్.. ప్రపంచకప్ అనేసరికి మాత్రం ఒక్కసారిగా బిక్కచచ్చిపోవడం ఆనవాయితీగా మారిపోయింది. 1992లో తొలిసారి విశ్వ వేదికపై దాయాదులు తలపడగా.. సచిన్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో టీమ్ఇండియా తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఇక అక్కడి నుంచి ఏ మెగాటోర్నీలోనూ భారత్‌కు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయిన పాక్.. ఈ సారైతే మరీ నాసిరకం ప్రదర్శన కనబర్చింది.
‘గతం గతః.. పాత విషయాలు పట్టించుకోం. రికార్డులు ఉన్నది బద్దలు కొట్టేందుకే. ఈసారి విజయం మాదే’ అని మ్యాచ్‌కు ముందు బీరాలు పలికిన పాక్ కెప్టెన్ బాబర్.. నాణ్యమైన పేస్‌ను ఎదుర్కోలేక మధ్యలోనే కాడి ఎత్తేయగా.. ‘పాక్ పేసర్లను ఎదుర్కోవడం భారత్ వల్ల కాదు’అని ప్రగల్భాలు పలికిన ఆ దేశ మాజీ ఆటగాళ్లకు రోహిత్ భారీ సిక్సర్లతో గట్టిగా బదులిచ్చాడు. ఏడేండ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్.. అన్నీ పిచ్‌లు ఉప్పల్ లాగే ఉంటాయని పొరబడి మూల్యం చెల్లించుకుంది. హైదరాబాద్ వేదికగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన పాక్.. అహ్మదాబాద్‌లో అతి సాధారణ జట్టుగా కనిపించింది. లక్ష్యం చిన్నదే అయినా.. దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం పాక్ ఆటగాళ్ల శరీర భాషలో ఏ కోశానా కనిపించలేదు. ఏదో బౌలింగ్ వేయక తప్పదు అన్నట్లు వేయడం తప్ప.. అందులో తీవ్రత మాత్రం కరువైంది. ఇక రోహిత్ రఫ్ఫాట ప్రారంభించాక అయితే పాక్ బౌలింగ్ గల్లీ జట్టును తలపించింది. లక్ష మందికి పైగా అభిమానుల జాతీయ గీతాలాపనతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మారుమోగిపోగా.. మరో 117 బంతులు మిగిలుండగానే టీమ్ఇండియా మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది.
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
పాకిస్థాన్: 42.5 ఓవర్లలో 191 (బాబర్ 50, రిజ్వాన్ 49; బుమ్రా 2/19, పాండ్యా 2/34),
భారత్: 30.3 ఓవర్లలో 192/3 (రోహిత్ 86, శ్రేయస్ 53నాటౌట్; షాహీన్ 2/36).