SA vs ENG | సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ కష్టాల్లో చిక్కుకుంది. సఫారీలు నిర్దేశించిన 400 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్.. 10 ఓవర్లకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టు టాప్- 4 బ్యాటర్లు అయిన జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్ లు పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చిన చోట సఫారీ బౌలర్లు రెచ్చిపోతున్నారు. మార్కో జాన్సెన్ రెండు వికెట్లతో దూకుడుమీదుండగా ఎంగిడికి ఒక వికెట్ తీశాడు.
400 పరుగులను ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ మూడో ఓవర్లోనే తొలి వికెట్ ను కోల్పోయింది. ఎంగిడి వేసిన తొలి ఓవర్లో ఐదో బంతికి ఆఫ్ స్టంప్ దిశగా భారీ సిక్సర్ బాదిన బెయిర్ స్టో (10).. అతడే వేసిన మూడో ఓవర్లో మూడో బంతికి డసెన్‌కు క్యాచ్ ఇచ్చాడు. వన్ డౌన్ లో వచ్చిన జో రూట్.. జాన్సెన్ వేసిన నాలుగో ఓవర్లో ఆఖరి బంతికి డేవిడ్ మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడే వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి డేవిడ్ మలన్ (6) కూడా వికెట్ కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఆరు ఓవర్లలోపే మూడు ప్రధాన వికెట్లను కోల్పోవడంతో ఇంగ్లండ్ ఆత్మరక్షణలో పడింది. ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న బెన్ స్టోక్స్ (8 బంతుల్లో 5) మీద ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకోగా అతడు కూడా నిరాశపరిచాడు. రబాడా వేసిన 9వ ఓవర్లో తొలి బంతికి స్టోక్స్.. అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేటప్పటికీ ఇంగ్లండ్.. నాలుగు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. బట్లర్, బ్రూక్ క్రీజులో ఉన్నారు.