WTC Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో రెండు రోజుల్లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య టెస్టు గద (Test Mace) ఫైట్ జరుగనుంది. ఇప్పటికే లండన్ చేరుకున్న ఇరుజట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఢిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడుతున్న ఆసీస్‌కు కళ్లెం వేసేందుకు సఫారీ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఫైనల్ ఆతిథ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌లోనే డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించడంలో అర్ధం లేదని కంగారు సారథి అన్నాడు.
టెస్టు క్రికెట్‌ను బతికించేందుకు ఐసీసీ 2021లో టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఆరంభించింది. ప్రారంభ సీజన్లో భారత్, న్యూజిలాండ్ నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో నిలవగా.. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. రెండో సీజన్ టైటిల్ పోరు కూడా ఇంగ్లండ్‌లోనే జరిగింది. ఓవల్ మైదానంలో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా విజేతగా అవతరించింది. ఇప్పుడు జరుగబోయే మూడో ఫైనల్ ఫైట్ కూడా ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌లో నిర్వహిస్తున్నారు. దాంతో.. ఈ పద్ధతి సరికాదని కమిన్స్ అంటున్నాడు. ఒకేదేశానికి ఫైనల్ హక్కులు కట్టబెట్టే బదులు.. గత సీజన్ విజేతకు ఆతిథ్య హక్కులు ఇస్తే బాగుటుందని అతడు అభిప్రాయపడ్డాడు.
Two teams. One dream 👑
South Africa and Australia are ready to carve their names in Lord’s history 🤩#Cricket #CricketReels #WTC25 pic.twitter.com/FgeID10JXv
— ICC (@ICC) June 9, 2025
‘ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఇంగ్లండ్ వేదికగా జరగడం ఇది మూడోసారి. టెస్టు గద, ఇతర సామాగ్రిని తరలించడం వంటి విషయాలు ఆలోచిస్తే.. ఒకే దేశంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరపడం ఒకరకంగా సమంజసమే అనిపించవచ్చు. కానీ, ఢిఫెండింగ్ ఛాంపియన్‌కు ఆతిథ్యం ఇస్తే వాళ్లకు గౌరవంగానూ ఉంటుంది. తదుపరి సీజన్ ఫైనల్‌కు అయినా కొత్త వేదికను ఎంచుకుంటే మంచిది. అయితే.. లార్డ్స్ కూడా సరైన ఎంపికే’ అంటూ కమిన్స్ వచ్చే సీజన్లో వేదికను తరలించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. ఆసీస్ సారథి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న పలువురు.. ‘నీ లాజిక్ సరైనదే ప్యాటీ’ అని ఆన్లైన్లో కామెంట్లు పెడుతున్నారు.
జూన్ 11న లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో ఓటమెరుగని ఆస్ట్రేలియాను చోకర్స్‌గా ముద్ర పడిన సఫారీలు నిలువరిస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది. నిరుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో 7 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా ‘ఛాంపియన్ ట్యాగ్’కు దూరమైంది. ఇప్పుడు ఆ జట్టుకు టెస్టు ఛాంపియన్షిప్ రూపంలో అద్భుతమైన అవకాశం వచ్చింది. దాంతో ఈసారి కొత్త ఛాంపియన్‌ను చూస్తామా? అని అభిమానులందరూ ఆతృతతో ఎదురుచూస్తున్నారు.