హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ కబడ్డీ సంఘంలో అలజడి! కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, జాతీయ కబడ్డీ ప్లేయర్ తోట సురేశ్ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్యాదవ్, కోశాధికారి కేబీ శ్రీరాములు గత 40 ఏండ్లుగా అక్రమాలు చేస్తున్నారని శనివారం అబిడ్స్ పోలీస్స్టేషన్లో సురేశ్ ఫిర్యాదు చేశాడు. 2020 నుంచి 2024 వరకు అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించిన సురేశ్..గత కొన్నేండ్లుగా కొనసాగుతున్న అవినీతి అక్రమాలను బహిర్గతం చేశాడు. అంతర్జిల్లా కబడ్డీ టోర్నీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వారికి చేరకుండా జగదీశ్వర్యాదవ్, శ్రీరాములు దుర్వినియోగం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సాట్స్ నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా సంఘానికి అధికారిక ఖాతా ఉన్నప్పటికీ మరో అనధికారిక ఖాతా ద్వారా 60 లక్షలు విత్డ్రా చేశారని సురేశ్ ఆరోపించాడు. ఇదిలా ఉంటే సూర్యాపేటలో 2021లో జరిగిన జాతీయ జూనియర్ కబడ్డీ టోర్నీకి కేటాయించిన రూ.1.20 కోట్లను వృథా చేశారని, అందులో రూ.50 లక్షలు వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నట్లు ఫిర్యాదులో పొందుపరిచాడు. దీనికి తోడు తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ కోసం ఒక సంస్థ ఇచ్చిన 20 లక్షల నిధులను జిల్లా సంఘాలకు ఇవ్వకుండా వాడుకున్నారని పేర్కొన్నాడు. ఏజీఎం, ఈసీ సమావేశాలు లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకున్నారని సురేశ్ తెలిపాడు. సంఘంలో నిధుల దుర్వినియోగంపై జగదీశ్వర్యాదవ్, శ్రీరాములును ప్రశ్నించినందుకు తనను బెదిరిస్తూ మహబూబాబాద్ జిల్లా అసోసియేషన్ నుంచి తొలిగించారని సురేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసోసియేషన్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని అన్నాడు. దీనిపై వెంటనే విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు.