Cristiano Ronaldo : సాకర్ దిగ్గజాల్లో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మైదానంలో దిగాడంటే గోల్స్ వర్షమే. ఫార్వర్డ్ ప్లేయర్ అయిన రొనాల్లో ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తా కొట్టించడంలో దిట్ట. గత రెండేండ్లుగా అల్ నస్రీ (Al Nassr) క్లబ్‌కు ఆడుతున్నఈ పోర్చ్‌గల్ కెప్టెన్ త్వరలోనే వీడ్కోలు పలకనున్నాడు. ఈ విషయాన్ని అతడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వచ్చే ఏడాది లేదా రెండు ఏండ్లలో ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాను అని రొనాల్డో తెలిపాడు.
పోలాండ్‌తో మ్యాచ్ అనంతరం రొనాల్డో ఇంటర్వ్యూలో తన భవితవ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను వీడ్కోలు పలకడం ఖాయం. వచ్చే ఏడాది లేదా రెండు ఏండ్లు ఆడుతానా? అనేది మాత్రం చెప్పలేను. ఇప్పటికైతే ఫుట్‌బాల్‌ను ఆస్వాదిస్తున్నా. ఎప్పుడు అయితే నాకు ఫుట్‌బాల్ మజా అనిపించలేదో అప్పుడు నిర్ణయం తీసుకుంటా. వీడ్కోలు ఎప్పుడు పలకాలి? అనేది నా చేతుల్లోనే ఉంది’ అని రొనాల్డో వెల్లడించాడు.
అంతేకాదు తాను 1,000 గోల్స్ గురించి ఆలోచించడం లేదని ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడు చెప్పాడు. నిజంగా చెబుతున్నా. కెరీర్లో వెయ్యి గోల్స్ రికార్డు గురించి నేను అసలు ఆలోచించడం లేదు. అయితే.. మనం ఎప్పుడైనా చరిత్ర సృష్టించాలనే కోరుకుంటాం. కానీ, ఇప్పుడు నా దృష్టి దాని మీద లేదు అని రొనాల్డో వివరించాడు.
ప్రపంచంలోని మేటి ఫుట్‌బాలర్లలో ఒకడైన రొనాల్డో 2022 ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) తర్వాత అల్ నస్రీ క్లబ్‌కు మారాడు. ఆ క్లబ్‌తో రెండున్నర ఏండ్ల కాలానికి రూ.4,400 కోట్లకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి ఆ క్లబ్ రాతే మారిపోయింది. సౌదీ ప్రో లీగ్‌లో రొనాల్డో కెప్టెన్సీలో ఆడిన అల్ నస్రీ క్లబ్ విజయాల బాట పట్టింది. తాజాగా ఒకే సీజన్లో 35 గోల్స్‌తో రొనాల్డో చరిత్రను తిరగరాశాడు. ప్రస్తుతం ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడి ఖాతాలో 893 గోల్స్ ఉన్నాయి.