కరోనా వైరస్ టీమ్ఇండియాకు మంచే చేసింది. ఇదేంటి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన మహమ్మారి.. టీమ్ఇండియాకు మంచి చేయడం ఏంటి అనుకుంటున్నారా..! అక్కడికే వస్తున్నా.. కొవిడ్-19 కారణంగా గత రెండేండ్లుగా ఏ సిరీస్ ప్రారంభమైనా దానికి చాలా రోజుల ముందే బయోబబుల్ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. అంతర్జాతీయ సిరీస్‌లు, శిక్షణ శిబిరాల్లో తప్ప ఎక్కువగా ఒకే చోట ఉండని భారత ఆటగాళ్లకు.. ఈ క్వారంటైన్ కాలం బాగా ఉపయోగ పడింది.
భిన్న భాషలు, సంస్కృతుల నుంచి వచ్చిన ఆటగాళ్లను ఏకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషించింది. హిమాచల్‌కు చెందిన పంత్.. హైదరాబాదీ సిరాజ్‌తో దోస్తీ చేస్తుంటే.. ముంబైకి చెందిన రోహిత్.. తమిళ తంబి అశ్విన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు! ఇక సారథి విరాట్ గురించి చెప్పాల్సిన పనేలేదు. నిన్న మొన్న జట్టులోకి వచ్చిన పృథ్వీ షా నుంచి.. టెస్టు జట్టులో అత్యంత సీనియర్ ఇషాంత్ వరకు అతడు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. దీనంతటి వెనుక కరోనా హస్తం ఉందనడంలో ఇంకా సందేహమా..! అయితే వివరాల్లోకి పదండి..
భారత డ్రెస్సింగ్ రూమ్‌ను గమనించండి. విరాట్‌తో కలిసి ఇషాంత్ తిరుగుతున్నాడు. వీరిద్దరివి భిన్న మనస్తత్వాలు అయినా ఎలాంటి ఇబ్బంది పడటం లేదు. ఇలాగే హార్దిక్‌తో పంత్.. కృనాల్‌తో కార్తీక్ దోస్తీ చేస్తున్నారు. ఇక్కడ కొందరికి ఇంగ్లిష్ రాదు, కొందరికి హిందీ రాదు. అయితేనేం అంతా కలిసి స్నేహంగా ముందుకు సాగుతున్నారు. ఇలా కలిసికట్టుగా ఉండటం వల్లే టీమ్ఇండియా మంచి ఫలితాలు సాధించ గలుగుతున్నది.
ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీరమైన వాతావరణం ఉండేది. కొత్త శతాబ్దంలో యువకుల రాకతో పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినా.. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ల ముందు నోరు విప్పాలంటే కొత్త ఆటగాళ్ల భయపడేవారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ రాకతో డ్రెస్సింగ్ రూమ్‌లో సందడి షూరూ అయినా.. అదీ ప్రొఫెషనల్‌గానే ఉండేది. అయితే ప్రస్తుత టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్ ఇందుకు పూర్తి భిన్నంగా దర్శనమిస్తున్నది. సీనియర్, జూనియర్ అనే తేడాలు పక్కనపెట్టి ఆటగాళ్లంతా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం అంతా కలిసి జాలీగా గడుపుతున్నారు. మరుపురాని క్షణాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ హల్చల్ చేస్తున్నారు. ఆటగాళ్ల మధ్య ఈ స్థాయి అనుబంధాల వెనుక కరోనా కూడా ఉంది. కొవిడ్-19 కారణంగా క్వారంటైన్లు, బయోబబుల్లు ఆటలో భాగమై పోవడంతో ఆటగాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. గతంలో చాలా తక్కువ సమయం మాత్రమే కలిసుండే ఆటగాళ్లు.. ఇప్పుడు రోజుల తరబడి బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా తోటి ఆటగాళ్లతోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జట్టులా కాకుండా.. ఓ కుటుంబంలో మెలుగుతున్న టీమ్ఇండియా.. మైదానంలోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నది.
ఒకరికి ఒకరు..
2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రవిచంద్రన్ అశ్విన్‌కు తొలినాళ్లలో హిందీ వచ్చేది కాదు. దీంతో ఆరంభంలో అతడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత భజ్జీ, యువీ సాయంతో ముందు తిట్ల నుంచి ప్రారంభించి ఇప్పుడు హిందీలోనే ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అలాగే తమిళనాడు నుంచే వచ్చిన యువ పేసర్ నటరాజన్ కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. అయితే మిగిలిన జట్టు సభ్యులు అతడిని ఒంటరి చేయకుండా వారి వంతు సాయం చేస్తూ అతడిని ప్రోత్సహించారు. దీంతోనే ఆసీస్‌లో అద్భుత ఫలితాలు వచ్చాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక జట్టులో అందరికంటే సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న చతేశ్వర పుజారాను జట్టు సభ్యులంతా ఆట పట్టించడంలోనూ అంతులేని ప్రేమ దాగుందనేది సుస్పష్టం. 2019లో ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం అనంతరం టీమ్ అంతా కలిసి మైదానంలో పుజారా డాన్స్ అంటూ చేతులు, కాళ్లు ఊపడం అభిమానులకు ఇంకా గుర్తే! ఇలా గ్రౌండ్ లోపలా, బయటా అంతా కలిసి కట్టుగా ఉండటం.. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల గ్రౌండ్లో మనవాళ్ల ప్రదర్శన కూడా మెరుగైంది.
టెక్నాలజీ మార్చింది
భారత ఆటగాళ్లలో వచ్చిన ఈ నయా మార్పులకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడింది. గతేడాది లాక్డౌన్ సమయంలో సామాజిక మాధ్యమాల్లో మనవాళ్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆన్లైన్ ఇంటర్వ్యూలు, ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్ చాట్లు, ఫేస్బుక్ లైవ్‌లు ఇలా ఒక్కటేమిటి అవకాశం ఉన్న ప్రతీ చోట మనవాళ్లే కనిపించారు. నేరుగా కలుసుకునే వీలు లేకపోవడంతో తరచూ జూమ్ మీటింగ్‌ల ద్వారా ఒకరినొకరు పరామర్శించుకున్నారు. ఇలా జట్టు సభ్యుల మధ్య బంధం బలమైంది. ఆ తర్వాత ఎలాంటి టోర్నీకి వెళ్లిన క్వారంటైన్ తప్పనిసరి కావడంతో ఆటగాళ్ల మధ్య అనుబంధాలు పెనవేసుకుపోయాయి. గతంలో ఒకే ప్రాంతం నుంచి వచ్చిన ఆటగాళ్ల మధ్య ఎక్కువ సఖ్యత కనిపించేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. భాషతో సంబంధం లేకుండా మనవాళ్లు జట్టుగా ముందుకు సాగుతున్న తీరు అభిమానులను కట్టి పడేస్తున్నది.
ఐకమత్యమే మహాబలం
ఒకప్పుడు టీమ్ బస్సులో సీనియర్ ఆటగాళ్లకు నిర్దేశిత స్థానాలు ఉండేవి.. కొత్తగా జట్టులోకి వచ్చినవాళ్లు వెనుక సీట్లకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరు ఎక్కడైనా కూర్చుంటున్నారు. ఎవరు ఎవరితోనైనా మాట్లాడుతూన్నారు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా బ్యాట్‌తో ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకొని పెవిలియన్‌కు వస్తున్న సమయంలో భారత ఆటగాళ్లంతా వరుసగా నిల్చొని వారికి చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ ఘటనకు ముందు జట్టు ఆటగాళ్లతో మాట్లాడిన కోహ్లీ..
‘వారికి స్వాగతం పలికే చప్పుడు ఎలా ఉండాలంటే.. లార్డ్స్ గోడల్లో అది ఎప్పటికి ప్రతిధ్వనించాలి’ అన్నాడు. దీన్ని బట్టి భారత జట్టులో వ్యక్తిగత ప్రదర్శనలు, మైలురాళ్ల కన్నా భావోద్వేగాలకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఒక్కరోజులో సాధ్యమైంది కాదు. నేను కెప్టెన్‌ను.. మేము సీనియర్లం అనే భేషజాలు లేకుండా ప్రధాన ఆటగాళ్లు.. యువకులకు ప్రోత్సాహం అందించడం వల్లే ఇది సాధ్యపడింది. దీనికి పరోక్షంగా కరోనా తోడ్పడింది.