ముంబై: టీమ్ఇండియా సారథి రోహిత్‌శర్మపై కాంగ్రెస్ నాయకురాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి శమా మహ్మద్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. రోహిత్ లావుగా ఉన్నాడని, అతడు బరువు తగ్గాలని ఆమె చేసిన ట్వీట్‌పై రాజకీయ నాయకులు, మాజీ క్రికెటర్లు, నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. శమా తన ట్వీట్లో ‘రోహిత్ శర్మ క్రీడాకారుడిగా ఫిట్‌గా లేడు! అతడు బరువు తగ్గాలి. భారత క్రికెట్ జట్టులో గత సారథులతో పోల్చితే ఆకట్టుకోని కెప్టెన్ అతడే’ అని రాసుకొచ్చింది.
ఈ ట్వీట్ నెట్టింట కాసేపట్లోనే వైరల్ అయింది. శమా ట్వీట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ స్పందిస్తూ ‘గత కొన్నాళ్లుగా రోహిత్ ప్రదర్శన నాసిరకంగా ఉంది. ఇటీవల కాలంలో అతడు ఒక సెంచరీ తప్పితే మిగతా మ్యాచ్‌లలో రెండు, మూడు, నాలుగు పరుగులే చేసి ఔట్ అవుతున్నాడు. అతడు జట్టులో ఉండకూడదు. ఇతర ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో భారత జట్టు గెలుస్తుంది తప్ప కెప్టెన్ పాత్ర ఏమీలేదు. శమా చెప్పింది అక్షరాలా నిజం’అని వ్యాఖ్యానించడం గమనార్హం.
శమా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి మాట్లాడుతూ.. ‘ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు! భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌నూ వాళ్లు వదట్లేదు. రాజకీయాల్లో విఫలమైన వారి నాయకుడు రాహుల్ గాంధీని వాళ్లు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారేమో’ అని కౌంటర్ ఇచ్చాడు. శమా ట్వీట్ రాజకీయంగా దుమారం రేపడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎప్పటిలాగానే అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, వాటికి పార్టీతో సంబంధం లేదని తెలిపింది.