హైదరాబాద్ జూలై 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తన కక్ష రాజకీయాలను విస్తరిస్తున్నది. నిన్నమొన్నటి వరకు కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డ ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే కూడా అరెస్టులు చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, గతంలో ఎన్నడూలేనివిధంగా ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ఆధిపత్యం సాధించేందుకు ఏకంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై సీఐడీతో కేసు నమోదు చేయించి అదుపులోకి తీసుకున్నది. బుధవారం రాష్ట్ర సీఐడీ విభాగం పోలీసులు హెచ్‌సీఐ అధ్యక్షుడు జగన్మోహన్ రావును అదుపులోకి తీసుకొని విచారణ పేరుతో రాత్రి పోలీసు స్టేషన్లో పెట్టింది. ఇంకా అరెస్టు విషయాన్ని అధికారికంగా పోలీసులు ప్రకటించలేదు. ఐపీఎల్ టికెట్ల స్పాన్సర్లను టికెట్లు డిమాండ్ చేశాడన్న కారణంతో సీఐడీ పోలీసులు జగన్మోహన్ రావును ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
సాధారణంగా క్రికెట్ స్పాన్సర్లు కొన్ని టికెట్లను క్రీడాకారులకు, క్రీడను నిర్వహించే స్టేడియం బాగోగులు చూసుకునే హెచ్‌సీఏకు ఇస్తుంటాయి. హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచులకు సంబంధించి అత్యధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు తమకు సాధారణంగా ఇచ్చే టిక్కెట్లకు అదనంగా మరో పది శాతం టిక్కెట్లను ఇవ్వాలని సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ను కోరారు. అయితే, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ హెచ్‌సీఏ అధ్యక్షుడి అభ్యర్ధనను తోసిపుచ్చింది. దీనిపై హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్‌ల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. ఇరుపక్షాల మధ్య భేదాభిప్రాయాలూ వచ్చాయి.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు 2023 అక్టోబర్‌లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత నెల రోజులకే రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే రాష్ట్రంలో, హెచ్‌సీఏలో ఒకేసారి అధికార మార్పిడి జరిగింది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీఏపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించింది. భువనగిరి ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఉప్పల్ స్టేడియానికి వెళ్లి నానా హడావుడి చేశారు. తమ అనుచరుల పిల్లలను అండర్-16లో ఎంపిక చేయలేదని, తమ రికమండేషన్లు ఎందుకు పట్టించుకోవడంలేదని హెచ్‌సీఏపై ఆయన చిందులు తొక్కారు. ఇక ప్రస్తుత స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి ఏకంగా హెచ్‌సీఏపై అనేక సందర్భాల్లో ఆరపణలు చేయడంతోపాటు ఉప్పల్ స్టేడియం ఎదుట ధర్నా కూడా చేశాడు. వీరిద్దరూ అప్పుడే జగన్మోహన్ రావు పదవిలో ఎలా కొనసాగుతారో చూస్తామంటూ హెచ్చరించిన విషయం ఇక్కడ ప్రస్తావన్హాం. వీరి ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సీఏను లొంగదీసుకునే అంశంపై తీవ్ర కసరత్తు చేసింది. అంతేకాదు..ప్రభుత్వంలోని ముఖ్యనేత సోదరుడు ఎలాగైనా హెచ్‌సీఏలో పదవి దక్కించుకోవాలన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వీరికి జగన్మోహన్ రావు అడ్డంకిగా ఉండడంతోనే ఆయనను ఏదో ఒక కేసులో అరెస్టు చేసి భయపెట్టాలని చూస్తున్నదని పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాలవారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే తొలుత విజిలెన్స్ విచారణ అని మొదలుపెట్టారని, ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీఐడీ కేసు చేసిందని చెప్తున్నారని పలువురు క్రీడాభిమానులు చెప్తున్నారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న గడ్డం వివేక్ వెంకటస్వామి ఆనాడు హెచ్‌సీఏలో తన ప్యానల్‌ను పెట్టారు. వివేక్ ప్యానల్ తరఫున అమర్నాథ్ అధ్యక్షుడిగా పోటీచేశారు. జగన్మోహన్ రావు హెచ్‌సీఏ ఎన్నికల్లో గడ్డం వివేక్ వెంకటస్వామి ప్యానల్ తరఫున నిలబడ్డ అమర్నాథ్పై విజయం సాధించారు. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు రుచించలేదన్న ప్రచారం కూడా ఉన్నది. ఇప్పుడు ఎలాగైనా సరే జగన్మోహన్రావును తప్పించి రాష్ట్ర ముఖ్యనేత క్రీడలతో ఏమాత్రం సంబంధంలేదని తన సోదరుడికి పట్టం కట్టించాలని తాపత్రయపడుతున్నాడని చెప్తున్నారు.