పుణె, జనవరి 6: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ప్రముఖ నేత సురేశ్ కల్మాడి (81) మంగళవారం పుణెలో కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని కల్మాడి హౌజ్‌కు తరలించగా పలువురు నేతలు నివాళి అర్పించారు.
సాయంత్రం పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కల్మాడిని కాంగ్రెస్ సర్కార్, 2010లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కమిటీకి చైర్మన్‌ను చేసింది.
అయితే గేమ్స్‌కు సంబంధించి కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున కుంభకోణం వెలుగుచూడటంతో, గేమ్స్ నిర్వహణలో సురేశ్ కల్మాడి పాత్ర వివాదాస్పదమైంది. దీనికంటే ముందు ఆయన రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు కల్మాడి కెరీర్ పైలట్‌గా మొదలైంది. 1960లో ఆయన ఎన్డీఏకు ఎంపికై.. ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. స్వ్కాడ్రన్ లీడర్‌గా రిటైర్మెంట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కేసులో సీబీఐ అతడ్ని 2011లో అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపింది. దీంతో అతడ్ని పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.