హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : హెచ్‌సీఏ సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుల నియామకంపై సీఐడీకి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఏ ఫహీమ్ సోమవారం ఫిర్యాదు చేశారు. సెలక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక హెచ్‌సీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఈ కమిటీలో సభ్యులకు ఉండాల్సిన అర్హతలు లేకున్నా సభ్యులుగా నియమించారని ఆయన ఆరోపించారు.
సీనియర్ కమిటీలో సభ్యులుగా ఉండాలంటే కనీసం 7 టెస్ట్ మ్యాచ్‌లో ప్లేయర్‌గా ఆడి ఉండాలని, లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాలని లేదా 10 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడినవారై ఉండాలని చెప్పారు. ఇట్లాంటి ఎన్నో అవకతవకలు ఉన్నాయని వాటిపై సమగ్రంగా విచారణ జరిపి.. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.