Wrestlers | న్యూఢిల్లీ: తమకు జరిగిన అన్యాయంపై కుస్తీవీరులు అలుపెరుగకుండా పోరాడుతూనే ఉన్నారు. పరిస్థితులు ప్రతిబంధకంగా మారినా వెరవకుండా ముందుకుసాగుతున్నారు. గత 13 రోజులుగా జంతర్‌మంతర్ వేదికగా రెజ్లర్లు సడలని పోరాటంతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ను అరెస్ట్ చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందన్న రెజ్లర్లు భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు. లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్‌భూషణ్ మెడలు వంచాలని చూస్తున్న రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్‌లకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది.
ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలను కొనసాగించేందుకు రెజ్లర్లు శుక్రవారం రెండు కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. 31 మందితో ఒక కమిటీ, తొమ్మిది మంది సభ్యులతో మరో కమిటీ ఏర్పాటు చేసినట్లు పునియా మీడియాకు వివరించాడు. కింది కోర్టును సంప్రదించాలంటూ సుప్రీం కోర్టు సూచించిన క్రమంలో రెజ్లర్లు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ ‘ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై కేసులు విచారిస్తున్నారు. త్వరలోనే అన్ని విషయాలు తేటతెల్లమవుతాయి” అని అన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై సరైన చర్యలు తీసుకోకపోతే తన పతకాలు తిరిగి ఇచ్చేస్తానన దిగ్గజ కోచ్ మహవీర్‌సింగ్ ఫోగట్ హెచ్చరించారు.