బెంగళూరు: 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్లో తొలి ట్రోఫీ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు బెంగళూరులో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. తమ కప్పు కలను నెరవేర్చిన ఆటగాళ్లకు బెంగళూరు అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి మొదలుకుంటే బెంగళూరు నడిబొడ్డున ఉన్న విధాన సౌధ దాకా రజత్ పటీదార్ అండ్ కో.కు బ్రహ్మరథం పట్టారు. బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్న ఆర్సీబీ ఆటగాళ్లను కర్నాటక ప్రభుత్వం విధాన సౌధ వద్ద ఘనంగా సత్కరించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించారు. అంతకంటే ముందు శివకుమార్.. తన కారులో ఆర్సీబీ జెండా చేతబూని.. విమానాశ్రయానికి వెళ్లి మరీ ఆటగాళ్లందరికీ సాదర స్వాగతం పలికారు. విధాన సౌధలో సీఎంతో ప్రత్యేక సమావేశమైన ఆటగాళ్లు.. కొద్దిసేపు విరామం తర్వాత అక్కడే ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి వచ్చి ప్రభుత్వ సన్మానాన్ని స్వీకరించారు. వేలాది మంది అభిమానుల సమక్షంలో సీఎం, డిప్యూటీ సీఎం ఆర్సీబీ క్రికెటర్లకు శాలువాలు కప్పుతూ సంప్రదాయక మైసూర్ తలపాగాలు పెడుతూ మెమొంటోలను అందజేశారు.
విజయయాత్ర రద్దు
సాయంత్రం 5 గంటలకు విధానసౌధలో కార్యక్రమం ముగియగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆర్సీబీ ఆటగాళ్లు విజయయాత్ర చేసుకుంటూ చిన్నస్వామి స్టేడియానికి వెళ్లాల్సి ఉండగా… అప్పటికే అక్కడ తొక్కిసలాట జరిగిందన్న వార్తలు బయటకు రావడంతో ఓపెన్ బస్ పెరేడ్‌ను రద్దు చేశారు. ఆటగాళ్లను ప్రత్యేక బస్సులో చిన్నస్వామికి తీసుకొచ్చారు.
ఇది మీ కోసమే: కోహ్లీ
చిన్నస్వామిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడుతూ.. “ఇది (ట్రోఫీ) మీ కోసం. ఆర్సీబీ విజయాలు, ఓటముల్లో మీరు మాకు అండగా నిలిచారు. ప్రపంచంలో ఏ ఫ్రాంచైజీకి కూడా ఇటువంటి ఫ్యాన్ బేస్ ఉండటం నేనైతే చూడలేదు. మీ అందరికీ కృతజ్ఞతలు’ అని ముగించాడు. అతడు మాట్లాడే ముందు చిన్నస్వామి మొత్తం ‘కోహ్లీ.. కోహ్లీ..’ అంటూ హోరెత్తిపోవడంతో కోహ్లీ కొద్దిసేపు ఆగి ‘దయచేసి నన్ను మాట్లాడనివ్వండి’ అని అభిమానులను కోరడం విశేషం. కోహ్లీ కంటే ముందు రజత్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ ఆరంభం నుంచి మేం ఏం చేయాలనేదానిపై పూర్తి స్పష్టతతో ఉన్నాం. మీ అందరూ (అభిమానులనుద్దేశిస్తూ) ఈ ట్రోఫీ విజేతలుగా అర్హులు’ అని అన్నాడు. తొక్కిసలాట నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు పెద్దగా సంబురాలు లేకుండానే త్వరగా కార్యక్రమాన్ని ముగించి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.