బెంగళూరు: రానున్న ఐపీఎల్ సీజన్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఊరట లభించింది. చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు తోడు ఐపీఎల్ నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు హోంశాఖ..కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ)కు అధికారికంగా తెలిపింది. దీంతో గత కొన్ని నెలలుగా సాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడినట్లు అయ్యింది.
అయితే ప్రభుత్వం నియమించిన టాస్‌ఫోర్స్ విధించిన నిబంధనలతో కూడిన నివేదికను అనుసరించి హోంశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కేఎస్‌సీఏ అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ పేర్కొన్నాడు. ప్రభుత్వ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్న నమ్మకం మాకు ఉందని ఆయన తెలిపాడు. ఇటీవలే కేఎస్‌సీఏ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్ ప్రసాద్ ప్రభుత్వంతో నిరంతరం జరిపిన చర్చల ఫలితంగానే సందిగ్ధతకు తెరపడినట్లు తెలిసింది.