Asian Games 2023 : చైనాలో జరుగుతున్నఆసియా గేమ్స్(Asian Games 2023) ఆరంభ పోరులో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు భారీ ఓటమి ఎదురైంది. ఆతిథ్య చైనా చేతిలో సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) బృందం 1-5లో చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ అరంభం నుంచే చైనా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. తొలి అర్థ భాగంలో మొదటి గోల్ కొట్టారు. ఆ తర్వాత భారత ఆటగాడు రాహుల్ కేపీ(Rahul KP) గోల్ చేయడంతో స్కోర్ సమం అయింది. అయితే.. రెండో అర్థ భాగంలో చైనా జట్టు చెలరేగి ఆడి మ్యాచ్ సొంతం చేసుకుంది.
గ్రూప్ ఏలో ఉన్న భారత్, చైనా ఈరోజు తలపడ్డాయి. తొలి అర్థ భాగంలో స్కోర్ సమం కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే.. చివరి 45 నిమిషాల్లో చైనా ఆటగాళ్లు ఏకంగా నాలుగు గోల్స్ చేశారు. టావో, హావో ఫాంగ్ రెండేసి గోల్స్‌తో జట్టుకు భారీ విజయం అందించారు. సెకండ్ హాఫ్‌లో ఛెత్రీ సేన ఎంతగా ప్రయత్నించినా ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది.
సొంత గడ్డపై వరుసగా మూడు ట్రోఫీల్లో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా ఇది ఊహించిని షాక్. భారత జట్టు ఓటమికి ప్రాక్టీస్ సమయం లేకపోవడం కూడా ఓ కారణం. ఛెత్రీ బృందం పోటీలకు 20 గంటల ముందు చైనాలో అడుగుపెట్టింది. దాంతో, మ్యాచ్‌కు సన్నద్ధం కావడానికి ఆటగాళ్లుకు తగినంత సమయం దొరకలేదు.