పెద్దపల్లి, మే 26 (నమస్తే తెలంగాణ) : ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికీత.. సోమవారం వరల్డ్ యూత్ గేమ్స్‌కు ఎంపికైంది. ఈ నెల 21-25వ మధ్య పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఏఎస్ఐ)లో ట్రయల్స్ జరగగా, ఆర్చరీ కాంపౌండ్‌లో దేశం నుంచి ముగ్గురు ఆర్చర్లు వరల్డ్ యూత్ గేమ్స్‌కు ఎంపికయ్యారు.
వారిలో పర్నిత్ కౌర్(పంజాబ్), దీక్షల్(మహారాష్ట్ర)తో పాటు చికీత ఒకరు. ఈ ముగ్గురూ ఆగస్టులో కెనడా వెళ్లనున్నారు. ఇటీవల చైనాలోని అవైన్లో జరిగిన స్టేజ్-2 పోటీల్లో ప్రపంచంలోని 30దేశాలు పాల్గొనగా, తెలంగాణ నుంచి చికీత, ఆంధ్రప్రదేశ్ నుంచి జ్యోతి సురేఖ, మహారాష్ట్ర నుంచి మధుర పాల్గొని భారత్‌కు సిల్వర్ మెడల్‌ను తెచ్చారు. ఇప్పుడు వరల్డ్ యూత్ గేమ్స్‌కు సైతం చికీత ఎంపిక కావడంపై పెద్దపల్లి జిల్లా వాసులు, క్రీడాభిమానాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.