Microbrewery | మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. కొత్త మైక్రో బ్రూవరీ-25 పాలసీకి శ్రీకారం చుట్టింది. టీసీయూఆర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజన్), ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది. మైక్రోబ్రీవరీల ఏర్పాటుకు పలు సంస్థలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ పాలసీ వల్ల పలు సంస్థలు కొత్తగా మైక్రోబ్రీవరీలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడనుంది. ఈ మేరకు కొత్త మైక్రోబ్రీవరీల ఏర్పాటుకు అవసరమైన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నెల 3 నుంచి 25 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి దరఖాస్తు ఫీజును రూ.లక్షగా నిర్ణయించింది. మైక్రోబ్రూవరీలను బార్లు, ఎలైట్ బార్లు, క్లబ్‌లకు, టూరిజం స్థలాల్లోను, హోటల్, రెస్టారెంట్, ఆహార పదార్థాలు అందజేసే సంస్థలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అవసరమైన 1000 స్వ్కైర్ ఫీట్ల స్థలాన్ని ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు సంబంధిత శాఖలు జారీ చేసిన అనుమతి పత్రాలను కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లలో దరఖాస్తులను సంబంధిత ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్‌లోని మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుప్పల్, జవహర్‌నగర్, ఫిర్జాదిగూడ, నిజాంపేట్, రంగారెడ్డిలో బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోనివారు దారఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని చెప్పింది. మైక్రో బ్రూవరీల ఏర్పాటుతో బీర్ల కోసం ఇక మద్యం దుకానాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లిన సమయంలోనే చల్లని బీరును సైతం ఆస్వాదించే అవకాశం ఉంది.