Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. దేశంలో కీలకమైన ఖనిజాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి రూ. 1,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 సంవత్సరం వరకు ఆరు సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది. ఇది కీలకమైన ఖనిజాల వెలికితీత కోసం బ్యాటరీ వ్యర్థాలు, ఈ-వ్యర్థాలను రీసైకిల్ చేసే సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కొత్త యూనిట్లలో పెట్టుబడి పెట్టడంతో పాటు ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణ, ఆధునీకరణ, వైవిధ్యీకరణకు ఈ పథకం వర్తిస్తుంది. యూనిట్‌కు మొత్తం ప్రోత్సాహకం (CAPEX ప్లస్ OPEX సబ్సిడీ) పెద్ద యూనిట్లకు రూ.50కోట్లు, చిన్న యూనిట్లకు రూ.25 కోట్ల గరిష్ట పరిమితి ఉంటుంది.
ఈ పథకం దాదాపు రూ.8,000 కోట్ల పెట్టుబడిని తీసుకువస్తుందని.. దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 70వేల ఉద్యోగాలను తీసుకువస్తాయని భావిస్తున్నారు. ఈ పథకం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)లో భాగంగా ఉంటుంది. భారత్‌లో ఇలాంటి ఖనిజాల దేశీయ సరఫరా పెంచడం, సరఫరా గెలుసును బలోపేతం చేయడం దీని లక్ష్యం. వీటిని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఇతర హైటెక్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ ఖనిజాల గనులు సిద్ధంగా ఉండి.. ఉత్పత్తిని ప్రారంభించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. రీసైక్లింగ్ కోసం ఉపయోగించే ముడి పదార్థంలో ఈ-వ్యర్థాలు (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు), లిథియం అయాన్ బ్యాటరీ (LIB) స్క్రాప్, పాత వాహనాల ఉత్ప్రేరక కన్వర్టర్లు, ఇతర స్క్రాప్ ఉంటాయి. ఇది పెద్ద పారిశ్రామికవేత్తల నుంచి చిన్న వ్యవస్థాపకులు, స్టార్టప్‌ల వరకు ప్రయోజనం కలుగుతుంది. మొత్తం రూ.1500 కోట్లలో మూడింట ఒక వంతు చిన్న, కొత్త రీసైక్లర్లకు కేటాయించారు. ఈ పథకం కింద రెండు రకాల సబ్సిడీలు అందుబాటులో ఉంటాయి. మొదటిది కాపెక్స్ సబ్సిడీ, దీని కింద ప్లాంట్, యంత్రాలను ఏర్పాటు చేయడానికి 20శాతం సబ్సిడీ అందుబాటులో ఉంటుంది.
సకాలంలో ఉత్పత్తిని ప్రారంభించే వారికి పూర్తి సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఆలస్యమైతే తక్కువ సబ్సిడీ ఇస్తారు. రెండోది ఒపెక్స్ (OPEX) సబ్సిడీ. దీని కింద బేస్ ఇయర్ (2025-26) తో పోలిస్తే పెరిగిన అమ్మకాలకు బహుమతులు సైతం ఇస్తారు. 2026-27 నుండి 2030-31 వరకు, మొదటి దశలో 40శాతం సబ్సిడీ.. ఐదవ సంవత్సరం వరకు 60శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ పథకం కింద కొన్ని పరిమితులు విధించారు. పెద్ద పరిశ్రమలకు మొత్తం సబ్సిడీ రూ.50కోట్ల వరకు.. చిన్న పరిశ్రమలు, స్టార్టప్‌లకు రూ.25కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఒపెక్స్ (OPEX) సబ్సిడీ పరిమితి వరుసగా రూ.10 కోట్లు.. రూ.5 కోట్లుగా నిర్ణయించారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేసే దేశాలలో ఒకటి. లిథియం, కోబాల్ట్, నికెల్, రాగి వంటి విలువైన ఖనిజాలు పాత మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి.