Hardhik Pandya : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్ హీరో హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)కు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. ఓవైపు టీ20 కెప్టెన్సీ పోయిందనే బాధలో ఉండగానే.. భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకుల ప్రకటన పాండ్యా పరిస్థితికి అద్ధం పడుతోంది. వరల్డ్ కప్ హీరోగా స్వదేశం వచ్చిన ఈ ఆల్‌రౌండర్‌కు అందలం దక్కకపోగా.. కెప్టెన్‌గా తప్పించడాన్ని మాజీలు తప్పుపడుతున్నారు. అయితే.. పాండ్యాను పొట్టి ఫార్మాట్ సారథిగా తొలగించాలనే నిర్ణయం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)దే అని వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీలంక పర్యటన కోసం స్క్వాడ్‌ను ప్రకటించడానికి ముందు హార్దిక్ కెప్టెన్సీ పట్ల అగార్కర్ అనుమానం వ్యక్తం చేశాడట. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్‌గా పాండ్యా వైఫల్యంపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో చర్చించాడట. టీ20 వరల్డ్ కప్ 2026ను దృష్టిలో పెట్టుకొని నమ్మదగ్గ నాయకుడు అవసరమని అగార్కర్ అభిప్రాయం వ్యక్తం చేయగా.. గంభీర్ కూడా ఏకీభవించినట్టు సమాచారం. దాంతో, ఇద్దరూ కలిసి పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ అయిన సూర్యకుమార్ యాదవ్ పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
వచ్చే రెండేండ్లలో సొంతగడ్డపై టీ20 వరల్డ్ కప్ ఉంది. ఆలోపు బలమైన జట్టును తయారుచేయాలని అగార్కర్, గంభీర్ భావించారు. అందుకనే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఇదే తొలి సిరీస్. దాంతో, ఈ పర్యటనను విజయంతో ముగించాలని గౌతీ పట్టుదలతో ఉన్నాడు.
🆙 Next 👉 Sri Lanka 🇱🇰#TeamIndia are back in action with 3 ODIs and 3 T20Is#INDvSL pic.twitter.com/aRqQqxjjV0
— BCCI (@BCCI) July 18, 2024
సోమవారం టీమిండియాతో పాటు అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, రియాన్ డస్చేట్, తాత్కాలిక బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహతులే, ఫీల్గింగ్ కోచ్ టి. దిలీప్ కుమార్‌లు లంకకు బయల్దేరనున్నారు. ఇరుజట్ల మధ్య జూలై 27న తొలి టీ20 మ్యాచ్‌తో సిరీస్ ఆరంభం కానుంది.