పెన్ పహాడ్, డిసెంబర్ 27 :గ్రామానికి మంచి చేయాలనకున్న దళిత సర్పంచ్ వల్లపట్ల సైదమ్మ(Vallapatla Saidamma) పట్ల కాంగ్రెస్ నేతలు వివక్ష చూపించారు. బీ ఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి దోసపహాడ్ (Dosapahad) సర్పంచ్‌గా గెలుపొందిన ఆమె శనివారం ఎత్తిపోతల లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయగా.. కాంగ్రెస్ నాయకులు వచ్చి బంద్ చేశారు. దాంతో.. తనపై వివక్ష చూపుతున్నారని, సర్పంచ్‌గా తనకు విలువ లేకుండా చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని సైదమ్మ వాపోయారు.
దోసపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ వల్లపట్ల సైదమ్మ మాట్లాడారు. ‘సర్పంచ్‌గా ఎన్నికైన వారు ఎస్ 22.23 ఎత్తిపోతల పథకం నిర్వహణ బాధ్యత చూసుకోవడం మా గ్రామ సాంప్రదాయం. నా కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచి నిర్వహణ బాధ్యతను ఇప్పటివరకు చూసుకుంటున్నారు అన్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో నేను గెలిచాను కాబట్టి.. శుక్రవారం ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి మోటార్లు స్టార్ట్ చేశాను. అయితే.. కాంగ్రెస్ నాయకులు అడ్డు తగిలి మోటర్లు బంద్ చేసి, తాళాలు వేసుకుని పోయారు. రబీ సీజన్లో నాట్లు వేసుకునే తరుణమైనందున ఎత్తిపోతల పథకం కింద ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు’ అని సైదమ్మ తన ఆవేదన వ్యక్తం చేశారు.
సర్పంచ్‌గా తాను విధులు నిర్వర్తించడం కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని సైదమ్మ అన్నారు. తనపై పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు పెట్టారని ఆమె మీడియాకు తెలిపారు. అంతేకాదు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండ చూసుకొని ఎస్ ఐ గోపి కృష్ణ (SI Gopi Krishna) ఫోన్ చేసి బెదిరుస్తున్నాడని సైదమ్మ వెల్లడించారు. నీ మీద కేసు ఫైల్ అయింది. లిఫ్ట్ మోటార్లు ప్రారంభించడానికి మీరు ఎవరు? మీకు ఏ అధికారం ఉంది? ఒక్క ఎకరం పొలం లేని నీకు లిఫ్ట్ మోటర్ల మీద హక్కు లేదు? అంటూ ఎస్ఐ అర్ధ రాత్రి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా విన్నపం ఒక్కటే.. సంబంధించిన అధికారులు సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని సైదమ్మ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరికుప్పల రాంబాబు, వార్డ్ మెంబర్ ఒగ్గు మమత, గద్దల నాగయ్య. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎల్లావుల జగన్ వల్లప్పట్ల రవి, గోగుల సోమయ్య, వల్లప్పట్లు లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.