Saeed Ajmal | పాకిస్తాన్లో క్రికెట్ నిర్వహణ, పాలన తీరును ఆ దేశ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బయటపెట్టాడు. 2009 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి ప్లేయర్స్‌కు ఇచ్చిన హామీ నెరవేరలేదని వెల్లడించాడు. సయీద్ అజ్మల్ వెల్లడి కేవలం వ్యక్తిగత అనుభవం కాదు.. యావత్ పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థ బలహీనతను ప్రతిబింబిస్తున్నది. ప్రపంచ చాంపియన్ జట్టుకు ఇస్తామని ప్రకటించిన ప్రోత్సాహకాలను నేటికీ చెల్లించలేదు. మిగతా దేశాలు మాత్రం కోట్లాది రూపాయల ప్రోత్సాహకాలు ఇస్తూ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాయి. యూనిస్ ఖాన్ నాయకత్వంలో పాకిస్తాన్ 2009లో ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఇది పాకిస్తాన్ క్రికెట్‌కు ఒక చారిత్రాత్మక క్షణం.
అయితే, ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో ఆటగాళ్లకు లభించి గుర్తింపు.. ప్రకటించిన ప్రోత్సాహకాలన్నీ బూటకమేనని మాజీ స్పిన్నర్ వెల్లడించారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పాకిస్తాన్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా తమకు పెద్దతగా బహుమతులు ఏమీ ఇవ్వలేదని.. ఆ సమయంలో శ్రీలంక పర్యటనకు వెళ్లామని.. ఈ సమయంలో ప్రధానమంత్రి పిలిచి ప్రతి ఆటగాడికి రూ.25లక్షల చెక్కును ఇచ్చారన్నారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం కావడంతో సంతోషించామని.. కానీ ఆ చెక్కును మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్తే అది బౌన్స్ అయ్యిందని వెల్లడించాడు. ఇది ఆటగాళ్లకు షాక్‌లాంటిదని తెలిపాడు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కు బౌన్స్ అవుతుందని తాను నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్లేయర్స్ పీసీబీ సహాయం కోరినా ఎలాంటి సహాయం అందలేదని అజ్మల్ ఆరోపించాడు.
తాము ప్రపంచకప్ గెలిచినందుకు ఐసీసీ వచ్చిన ప్రైజ్‌మనీ మాత్రమే అందిందని చెప్పాడు. అజ్మల్ వ్యాఖ్యలు పాక్ క్రికెట్ పరిపాలన పనితీరు, ప్రభుత్వ నిబద్ధతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఇటీవల రూ.21కోట్ల ప్రోత్సాహక బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అజ్మల్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి ప్రోత్సాహకం బీసీసీఐ ఇవ్వనున్నది. దుబాయిలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి భారత జట్టు ఆసియా కప్‌ను నెగ్గింది. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్‌గా అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. జట్టు ఒక దశలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితిలో ఉండగా.. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.
Read More :
నేపాల్ సంచలనం.. వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ కైవసం
ట్రోఫీ మీ సొంతం కాదు.. బీసీసీఐ తీవ్ర అభ్యంతరం