ఢిల్లీ: ఐపీఎల్-19లో పడుతూ లేస్తూ సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా రెండో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసును రసవత్తరంగా మార్చేసింది. మంగళవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంతగడ్డపై 8 వికెట్ల తేడాతో చిత్తుచేసి సీజన్లో ఐదో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల ఛేదనను 17.3 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి పూర్తిచేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఓపెనర్ సంజూ శాంసన్ (52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 నాటౌట్) మరో కీలక ఇన్నింగ్స్ ఆడగా కార్తీక్ శర్మ (31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 నాటౌట్) అతడికి అండగా నిలిచాడు.
తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మరోసారి పేలవ బ్యాటింగ్‌తో నిర్ణీత ఓవర్లలో 155/7కే పరిమితమైంది. సమీర్ రిజ్వి (24 బంతుల్లో 4 సిక్సర్లతో 40 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 38) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ (2/22) రెండు వికెట్లు తీయగా అకీల్ (1/19), ముకేశ్ (1/31) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే ముందంజ వేయగా మరోవైపు ఆరో ఓటమితో క్యాపిటల్స్ తమ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
బంతి ఆధిపత్యం చెలాయించిన పిచ్‌పై ఛేదన అంత తేలికేమీ కాదని తెలియడానికి చెన్నైకి పెద్దగా టైమ్ పట్టలేదు. పవర్ ప్లేలో ఆ జట్టు రుతురాజ్ (6) వికెట్‌ను కోల్పోవడమే గాక చేసింది 44 పరుగులే. స్టార్క్, ఎంగిడి పొదుపుగా బౌలింగ్ చేయడంతో పర్యాటక జట్టు పవర్ ప్లేలో సైతం సింగిల్స్ మీదే దృష్టిపెట్టింది. ఎంగిడి బౌలింగ్‌లో స్కేర్ లెగ్, లాంగాన్ మీదుగా భారీ సిక్స్‌లు కొట్టిన ఉర్విల్ (17).. అక్షర్ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. 50 రన్స్ చేరడానికి ఆ జట్టు 7.2 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. కానీ క్రీజులో కుదురుకునేదాకా నెమ్మదిగా ఆడిన సంజూ.. మరో కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
నటరాజన్ వేసిన 9వ ఓవర్లో రెండు ఫోర్లతో గేర్ మార్చిన అతడు, ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. కుల్దీప్ 12వ ఓవర్లో అయితే 6, 6, 4తో విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లో అర్ధ శతకం సాధించిన సంజూ.. స్టార్క్ మరుసటి ఓవర్లోనూ రెండు బౌండరీలు బాది స్కోరుబోర్డును వంద దాటించాడు. నట్టూ వేసిన 15వ ఓవర్లోనూ రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 20 రన్స్‌ను రాబట్టి తన జట్టును గెలుపు దిశగా నడిపించాడు. నట్టూ బౌలింగ్‌లోనే సిక్స్, ఫోర్‌తో కార్తీక్ లాంఛనం పూర్తిచేశాడు.
ఒక మ్యాచ్‌లో ధాటిగా ఆడితే మరోదాంట్లో తేలిపోతున్న ఢిల్లీ.. ఈ పోరులో అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. బ్యాటర్లకు కఠిన సవాల్ విసిరిన పిచ్‌పై చెన్నై స్పిన్నర్లు చెలరేగడంతో క్యాపిటల్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆ జట్టులో రిజ్వి, స్టబ్స్ మినహా మిగిలినవారెవరూ 20 పరుగుల మార్కునూ దాటలేక చతికిలపడ్డారు. అకీల్‌కు తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో స్వాగతం పలికిన నిశాంక (19).. ముకేశ్ ఓవర్లో మిడాన్‌లో బ్రెవిస్ చేతికి చిక్కడంతో ఆ జట్టు వికెట్ల పతనం మొదలైంది. కేఎల్ రాహుల్ (12)ను అకీల్ బోల్తా కొట్టించాడు. ఇదే జోష్‌లో నూర్ తన వరుస ఓవర్లలో కరుణ్ నాయర్ (13), నితీశ్ రాణా (15)ను పెవిలియన్‌కు పంపడంతో మ్యాచ్‌పై సీఎస్కే మరింత పట్టుబిగించినైట్టెంది.
గుర్జప్నీత్ విసిరిన 11వ ఓవర్ ఆఖరి బంతిని ఆడబోయిన ఢిల్లీ సారథి అక్షర్ (2).. కవర్స్‌లో అకీల్ చేతికి చిక్కడంతో ఢిల్లీ 69/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిజ్వి, స్టబ్స్ వికెట్ కాపాడుకునేందుకే ఆడటంతో ఢిల్లీ స్కోరుబోర్డు ముందుకు కదల్లేదు. 15.2 ఓవర్లకు ఆ జట్టు స్కోరు వంద పరుగుల మార్కును అందుకోగా చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి క్యాపిటల్స్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుపడ్డారు. ఈ జోడీ 8 ఓవర్లపాటు క్రీజులో నిలిచినా చేసింది 65 పరుగులే. స్టబ్స్ భారీ స్కోరు చేయలేక విఫలమైనా అన్షుల్ 18వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన రిజ్వి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే యత్నం చేశాడు. ఆఖర్లో అశుతోష్ శర్మ (14) రెండు సిక్సర్లతో క్యాపిటల్స్ స్కోరును 150 పరుగుల మార్కును దాటించాడు.
ఢిల్లీ: 20 ఓవర్లకు 155/7 (రిజ్వి 40*, స్టబ్స్ 38, నూర్ 2/22, ఒవర్టన్ 1/5);
చెన్నై: 17.3 ఓవర్లకు 159/2 (సంజూ 87*, కార్తీక్ 41*, అక్షర్ 1/25, ఎంగిడి 1/30)
