గైక్వాడ్, డుప్లెసిస్ మెరుపులు
తాజా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏదీ కలిసిరావడం లేదు. మిడిలార్డర్ సమస్యతో తొలి మూడు మ్యాచ్‌లు ఓడిన రైజర్స్.. చెన్నైతో పోరులో డేవిడ్ వార్నర్ స్లో బ్యాటింగ్ వల్ల పరాజయం పాలైంది. బ్యాటింగ్ పిచ్‌పై అతి జాగ్రత్తకుపోయి ఓ మాదిరి స్కోరు చేసిన వార్నర్ సేన.. బౌలింగ్‌లోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది. మొత్తంగా ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది ఐదో పరాజయం కాగా.. ఐదో విజయంతో ధోనీ సేన టాప్ లేపింది!
ఢిల్లీ: గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో చతికిలబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈసారి స్లో బ్యాటింగ్‌కు మూల్యం చెల్లించుకుంది. బుధవారం చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ వార్నర్ (57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్ పాండే (46 బంతుల్లో 61; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలు సాధించగా..విలియమ్సన్ (10 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఆఖర్లో ధాటిగా ఆడాడు. చెన్నై బౌలర్లలో ఎంగ్డీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 75; 12 ఫోర్లు), డుప్లెసిస్ (38 బంతుల్లో 56; 6 ఫోర్లు, ఒక సిక్సర్) దుమ్మురేపడంతో చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్‌ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. మంచి ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో (7)ను నాలుగో ఓవర్లో సామ్ కరన్ ఔట్ చేయగా.. వార్నర్ నిదానంగా ఆడాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 39/1తో నిలిచింది. గత మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మనీశ్ పాండే కుదురుగా ఆడినా.. వార్నర్ టెస్టును తలపించాడు. ఈ క్రమంలో పాండే 35 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంటే.. వార్నర్ 50 బంతుల్లో ఆ ఫీట్ చేరుకున్నాడు. ఎంగ్డీ 18వ ఓవర్లో వార్నర్, పాండేను ఔట్ చేయగా.. ఆఖర్లో విలియమ్సన్ వేగంగా ఆడాడు. శార్దూల్ ఓవర్లో కేన్ 4,6,4,4 బాదితే.. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు జాదవ్ (12 నాటౌట్) 4,6 అరుసుకోవడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.
లక్ష్య ఛేదనలో ధోనీసేనకు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు దంచికొట్టడంతో పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై 50/0తో నిలిచింది. సందీప్ శర్మ (0/24) కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ (0/36), సిద్ధార్థ్ కౌల్ (0/32) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఖలీల్ ఓవర్లో డుప్లెసిస్ రెండు ఫోర్లు కొడితే.. సుచిత్ బౌలింగ్‌లో గైక్వాడ్ అదే పనిచేశాడు. గత మ్యాచ్‌లో చక్కగా బౌలింగ్ చేసిన జగదీశ సుచిత్ (0/45)ను ఈ జోడీ లక్ష్యంగా చేసుకోవడంతో చెన్నై స్కోరు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో డుప్లెసిస్ 32 బంతుల్లో, గైక్వాడ్ 36 బంతుల్లో హాఫ్‌సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సుచిత్ బౌలింగ్‌లో డుప్లెసిస్ 6,4 అరుసుకుంటే.. ఆ తర్వాత గైక్వాడ్ హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అదే జోరులో రషీద్ ఖాన్ ఓవర్లోనూ మూడు ఫోర్లు బాదిన గైక్వాడ్ తొలి వికెట్‌కు 129 పరుగులు జోడించాక ఔటయ్యాడు. 15వ ఓవర్లో రషీద్ వరుస బంతుల్లో అలీ (15), డుప్లెసిస్ (56)ను ఔట్ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. చేయాల్సిన పరుగులు ఎక్కువ లేకపోవడంతో జడేజా (7 నాటౌట్), రైనా (17 నాటౌట్) మిగిలిన పని పూర్తి చేశారు.
హైదరాబాద్: వార్నర్ (సి) జడేజా (బి) ఎంగ్డీ 57, బెయిర్‌స్టో (సి) చాహర్ (బి) సామ్ కరన్ 7, పాండే (సి) డుప్లెసిస్ (బి) ఎంగ్డీ 61, విలియమ్సన్ (నాటౌట్) 26, జాదవ్ (నాటౌట్) 12, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 171/3. వికెట్ల పతనం: 1-22, 2-128, 3-134, దీపక్ 3-0-21-0, సామ్ కరన్ 4-0-30-1, శార్దూల్ 4-0-44-0, అలీ 2-0-16-0, ఎంగ్డీ 4-0-35-2, జడేజా 3-0-23-0.
చెన్నై: గైక్వాడ్ (బి) రషీద్ 75, డుప్లెసిస్ (బి) రషీద్ 56, అలీ (సి) జాదవ్ (బి) రషీద్ 15, జడేజా (నాటౌట్) 7, రైనా (నాటౌట్) 17, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 18.3 ఓవర్లలో 173/3. వికెట్ల పతనం: 1-129, 2-148, 3-148, బౌలింగ్: సందీప్ 3.3-0-24-0, ఖలీల్ 4-0-36-0, కౌల్ 4-0-32-0, సుచిత్ 3-0-45-0, రషీద్ 4-0-36-3.
జట్టు ఆ గె ఓ నె,ర పా
చెన్నై 6 5 1 1.47 10
బెంగళూరు 6 5 1 0.89 10
ఢిల్లీ 6 4 2 0.26 8
ముంబై 5 2 3 -0.03 4
కోల్‌కతా 6 2 4 -0.30 4
పంజాబ్ 6 2 4 -0.60 4
రాజస్థాన్ 5 2 3 -0.68 4
హైదరాబాద్ 6 1 5 -0.26 2
ఆ-ఆడినవి, గె-గెలుపు, ఓ-ఓటమి, నె.ర-నెట్ రన్‌రేట్, పా-పాయింట్లు