చెన్నై: రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన క్రికెట్ పండుగ ఐపీఎల్ ముగింపు దశకు వచ్చేసింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో 16వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం జరుగనున్న తొలి క్వాలిఫయర్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన టీమ్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన సీజన్ ఆరంభ పోరులో చెన్నైపై గుజరాత్ పైచేయి సాధించగా.. ఆ పరాజయానికి సొంతగడ్డపై బదులు తీర్చుకోవాలని ధోనీ సేన కృతనిశ్చయంతో ఉంది.
నిరుడు లీగ్‌లో అడుగుపెట్టిన తొలిసారే విజేతగా నిలిచిన హార్దిక్ సారథ్యంలోని గుజరాత్.. టైటిల్ నెలబెట్టుకోవాలని చూస్తుంటే.. రికార్డు స్థాయిలో 12వ సారి ప్లే ఆఫ్స్‌కు చేరిన చెన్నై ఫైనల్లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నది. పేపర్ మీద ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో గుజరాత్ పటిష్టంగా ఉంటే.. సొంతగడ్డపై ఆడనుండటం చెన్నైకి కలిసొచ్చే అవకాశం ఉంది. గిల్, పాండ్యా, మిల్లర్, శంకర్, తెవాటియా, రషీద్ ఖాన్, షమీ గుజరాత్‌కు కీలకం కానున్నారు. మరోవైపు చెనైకి కెప్టెన్ ధోనీ అతిపెద్ద బలం కాగా.. రుతురాజ్, కాన్వే, రహానే, దూబే, అలీ, రాయుడు, జడేజాతో బ్యాటింగ్ శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది. టైటాన్స్ బౌలింగ్‌తో పోల్చుకుంటే చెన్నై కాస్త బలహీనంగా ఉంది.