ముంబై: ఐపీఎల్( IPL) క్రికెటర్లకు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. 10 ఫ్రాంచైజీలకు అధికారిక సమాచారాన్ని చేరవేసింది. 2026 సీజన్లో హనీట్రాప్ జరిగే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఓ లేఖలో అనుమానాలు వ్యక్తం చేశారు. టీ20 లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన తన కమ్యూనికేషన్లో పేర్కొన్నారు. ప్లేయర్ల హోటల్ రూమ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది. ఆటగాళ్లు ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఏడు పేజీలతో కూడిన మార్గదర్శకాల లేఖను అన్ని ఫ్రాంచైజీలకు సైకియా అందజేసినట్లు తెలుస్తోంది.
ఆటగాళ్లు, సిబ్బందిపై నిఘా పెట్టేందుకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. బీసీసీఐ, ఐపీఎల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులు అందులో ఉంటారు. హోటల్ రూమ్స్‌లో ఈ బృందాలు చెకింగ్ చేస్తాయి. అనుమతి లేని వ్యక్తులు ఎవరు ఉన్నా.. సదురు ప్లేయర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఆటగాళ్లను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అతిథులు ఎవరు వస్తున్నారు, హోటళ్ల వద్ద ఎలాంటి పరిస్థితి ఉందన్న అంశంపై టీమ్ మేనేజర్లు రికార్డులు సమర్పించాల్సి ఉంటుంది.
ఐపీఎల్ జట్టు సభ్యుల గదుల్లోకి ఇతరులను అనుమతించబోము అని సైకియా చాలా క్లియర్‌గా ఆ మార్గదర్శకాల్లో చెప్పారు. హోటల్ రూమ్ నుంచి వెళ్లాలనుకునే ఆటగాళ్లు సెక్యూర్టీ లైజియన్ ఆఫీసర్ లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్‌కు ముందుగా చెప్పి వెళ్లాలన్న నిబంధన పెట్టారు. హోటల్ పరిసరాల్లో తిరగాలనుకున్నా.. టీమ్ మేనేజర్ అనుమతి అవసరమని మార్గదర్శకాల్లో వెల్లడించారు.
ఐపీఎల్‌కు చెందిన అవినీతి నిరోధక, సెక్యూర్టీ యూనిట్.. ఆటగాళ్ల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసింది. డగౌట్లు, బస్సులు, హోటళ్ల వద్ద ప్లేయర్లు కాకుండా ఆటతో సంబంధం లేని వ్యక్తులు సంచరిస్తున్నట్లు ఏసీఎస్‌యూ తన నివేదికలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసినట్లు అర్థమవుతోంది. ఏసీఎస్‌యూ దీనిపై నివేదికను బీసీసీఐకి అందజేసినట్లు ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ దుమాల్ కన్ఫర్మ్ చేశారు.