భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఆ అమ్మాయి అత్యున్నత లక్ష్యం. అందుకోసం గత కొన్నేండ్లుగా నిరంతరం శ్రమిస్తూనే ఉంది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆమెది అలుపెరుగని పోరు. ఓవైపు పేదరికం ముందరి కాళ్లకు బంధం వేస్తున్నా..మొక్కవోని దీక్షతో ముందడుగు వేసింది. అల్వాల్ గల్లీల్లో అబ్బాయిలతో మొదలైన మమత క్రికెట్ ప్రస్థానం తాజాగా జాతీయ సీనియర్ జట్టుకు చేరింది. ఈ ప్రయాణంలో మమతది ఒడిదొడుకుల పయనం. బిడ్డ ఇష్టాన్ని గుర్తించిన తండ్రి వీరేశ్ జింఖానా మైదానంలో తొలి గురువుగా శిక్షణ ఇచ్చాడు. సరైన కిట్ లేకపోయినా..ఆడాలన్న కసితో ఆ అమ్మాయి అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంది. ఆర్థికంగా భారమైనా ఏనాడు తన బిడ్డను నిరుత్సాహపర్చని వీరేశ్ పడ్డ కష్టానికి ఇన్నాళ్లకు ఫలితం దక్కింది.
14 ఏండ్ల ప్రాయంలో క్రికెట్లోకి ప్రవేశించిన మమత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. విల్లు విడిచిన బాణంలా..లక్ష్యం వైపు దూసుకెళుతున్నది. అండర్-16, అండర్-19, జూనియర్, సీనియర్ ఇలా విభాగం ఏదైనా హైదరాబాద్ తరఫున అవకాశం వచ్చిన ప్రతీసారి తనను తాను నిరూపించుకుంది మమత. గత సీజన్లో హైదరాబాద్ తరఫున ఏడు మ్యాచ్‌లాడిన ఈ యువ క్రికెటర్ ఏడు ఔట్ల(స్టంపింగ్‌లు, క్యాచ్‌లు)లో పాలుపంచుకుంది. వికెట్ల వెనుక మహేంద్రసింగ్ ధోనీని తలపిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కంగుతినిపిస్తున్నది. సీనియర్లకు దీటైన పోటీనిస్తూ చురుకుగా కీపింగ్ చేసిన సందర్భాలు కోకొల్లలు.
కుటుంబ నేపథ్యం
మమతది పేద కుటుంబం. గుల్బర్గా (కర్ణాటక) నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన మమత కుటుంబం నగరంలోని అల్వాల్‌లో నివాసముంటున్నది. తండ్రి వీరేశ్ రజక వృత్తి నిర్వహిస్తూ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌లా విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి భాగ్య ఇండ్లలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నది. ప్రస్తుతం వందన కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న మమత.. ఎప్పటికైనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యమని పేర్కొంది. ఇదిలా ఉంటే చాముండేశ్వరీనాథ్ ఇచ్చిన మద్దతు మరువలేనిదని మమత పేర్కొంది. ప్రతీరోజు రామానాయుడు క్రికెట్ అకాడమీలో శిక్షణ కోసం వెళ్లేందుకు ఆటోకు అయ్యే ఖర్చు (రూ.20వేలు)ను ఆయన భరిస్తున్నారని తెలిపింది.
భారత ‘సి’ జట్టులో:
దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న మమత ప్రతిభను సెలెక్టర్లు గుర్తించారు. ఈ నెల 20 నుంచి రాయ్‌పూర్ వేదికగా మొదలయ్యే సీనియర్ మహిళల చాలెంజర్ టోర్నీకి మమతను ఎంపిక చేశారు. పూజ వస్ర్తాకర్ కెప్టెన్సీ వహిస్తున్న భారత ‘సి’ జట్టులో తెలంగాణ నుంచి మమతతో పాటు సీనియర్ క్రికెటర్ సబ్బినేని మేఘన కూడా ఉంది. తొలిసారి జాతీయ సీనియర్ జట్టుకు ఎంపిక కావడంపై మమత స్పందిస్తూ ‘టీమ్ఇండియా క్రికెటర్లతో కలిసి ఈ టోర్నీలో ఆడటం నా కెరీర్లో కీలక మలుపు. వారితో కలిసి డ్రెస్సింగ్‌రూమ్ పంచుకోవడం కొత్త అనుభూతి. సీనియర్ల నుంచి నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని అంది.
తండ్రే తొలి గురువు:
14వ ఏట క్రికెట్లోకి ప్రవేశించిన మమతకు తన తండ్రే తొలి గురువు. బిడ్డ ఇష్టాన్ని గుర్తించిన వీరేశ్..కూతురుతో కలిసి క్రికెట్ ఆడేవాడు. ఆర్థిక ఇబ్బందులు నీడలా వెంటాడుతున్నా..వెరవకుండా బిడ్డను ప్రోత్సహించాడు. సెలెక్షన్స్ కోసం జింఖానకు తీసుకెళ్లడం మమత కెరీర్‌ను మలుపు తిప్పింది. అండర్-16 రాష్ట్ర జట్టుకు ఎంపిక తర్వాత మమత మళ్లీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. కోచ్‌లు ఆనంద్, ఇంద్ర, సీనియర్ ప్లేయర్ నౌషీన్, ఫిట్నెస్ ట్రైనర్ సౌమ్య సహకారం మరువలేనిదని మమత చెప్పుకొచ్చింది.