Tamim Iqbal | చాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్‌కు షాక్ తగిలింది. తమీమ్ ఇక్బాల్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మరోసారి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంతకు ముందు గతేడాది జూలైలో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విధితమే. తమీమ్ 2007లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేసి 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 2023లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా జోక్యం తర్వాత.. 24 గంటల్లోనే తమీమ్ తన రిటైర్మెంట్ను నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ఇప్పటికే సెలెక్టర్లకు తన నిర్ణయాన్ని తెలిపాడు. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జాతీయ జట్టులో తిరిగి చేరాలని గాజీ అష్రఫ్ హొస్సేన్ నేతృత్వంలోని ప్యానెల్ కోరగా.. తమీమ్ రిటైర్మెంట్పై పట్టువీడడం లేదు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ సహా కొంతమంది ఆటగాళ్లు పునః పరిశీలించాలని సూచించారు. తాను చాలాకాలంగా ఇంటర్నేషన్ క్రికెట్‌కు దూరంగా ఉన్నానని.. ఆ దూరం అలాగే ఉంటుందని తమీమ్ పేర్కొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో తన అధ్యాయం ముగిసిందని.. తాను చాలాకాలం దీనిపై ఆలోచిస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ రాబోతుందని, తాను దృష్టిలో కనిపించకూడదనుకుంటున్నట్లు చెప్పాడు. నజ్ముల్ హుస్సేన్ తనను జట్టులోకి తిరిగి రావాలని కోరాడని.. లక్షన్ కమిటీతో చర్చ జరిగిందని.. ఇప్పటికీ తనను జట్టులో చేర్చుకోవాలని కోరుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు. చాలాకాలం కిందట బీసీబీ సెంట్రల్ ఒప్పందం నుంచి బయటకు వచ్చానని.. ఈ విషయాన్ని తాను పక్కన పెట్టానని పేర్కొన్నాడు. బీసీబీ కాంటాక్ట్ జాబితాలో లేని క్రికెటర్ గురించి ఎవరైనా ఎందుకు చర్చించుకుంటారు..? స్వచ్ఛంగా తన స్థానాన్ని వదులుకొని ఏడాది కంటే ఎక్కువ కాలమైందని తెలిపాడు. దాని తర్వాత కూడా అనవసరమైన చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. రిటైర్మెంట్, క్రికెట్లో కొనసాగడం ఒక క్రికెటర్, ప్రొఫెషనల్ ఆటగాడి హక్కు అని.. తనకు తాను సమయం ఇచ్చుకున్నానని.. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు తెలిపాడు.