Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో సర్వత్రా సంబురాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు నృత్యాలు చేస్తూ.. డ్రమ్స్ వాయిస్తూ విజయోత్సవాలు జరుపుకున్నారు. మాజీ క్రికెటర్లు సైతం పలువురు టీమిండియా విజయం సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం డ్యాన్స్ చేస్తూ సంబురాల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గవాస్కర్ ఛాంపియన్స్ ట్రోఫీకి కామెంటరీ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. టీమిండియా విజయం సాధించిన సమయంలో ఆయన గ్రౌండ్‌లోనే ఉన్నారు. టీమిండియా కప్‌ను అందుకున్న సమయంలో ఆయన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు. డ్యాన్స్‌తో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మరో వైపు టీవీ స్టూడియోలో ఉన్న మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా సైతం తమ సీట్లలో నుంచి లేచి ఈలలు వేస్తూ.. భాంగ్రా నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
12 సంవత్సరాల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దుబాయి వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆ తర్వాత 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 49 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ బ్యాటింగ్, స్పిన్నర్లు అద్భుతమైన బౌలింగ్ చేయడంతో భారత్ న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. రోహిత్ కెప్టెన్సీలో 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రెండో ఐసీసీ టైటిల్‌ను భారత్ నెగ్గింది. ఇంతకు ముందు భారత జట్టు 2002, 2013 తర్వాత ఐసీసీ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ మూడోసారి టైటిల్‌ను నెగ్గింది. ఇప్పటి వరకు ఏ జట్టు మూడుసార్లు చాంపియన్స్ ట్రోఫీని గెలవలేదు.