Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ జట్టును ప్రకటించింది. భారత జట్టు నుంచి ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. మూడోసారి టైటిల్‌ను సాధించింది. రోహిత్ కెప్టెన్సీలో ఎనిమిది నెలల్లోనే భారత్ వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను గెలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐసీసీ ప్రకటించిన జట్టులో రోహిత్‌కు స్థానం దక్కలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ జట్టులో కెప్టెన్‌గా న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ శాంట్నర్ ఎంపికయ్యాడు.
ఐసీసీ ప్రకటించిన జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, 12వ ఆటగాడిగా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది. భారత్‌తో పాటు రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టులో నుంచి రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ సైతం చోటు దక్కించుకున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మరో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చింది. ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున జట్టుల్లో భాగమయ్యారు. ఆతిథ్య పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి సెమీ-ఫైనల్స్‌కు చేరుకున్న జట్టులో నుంచి ఒక్క ఆటగాడికి చోటు దక్కలేదు. అలాగే, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ప్లేయర్లకు సైతం అవకాశం దక్కలేదు.
ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. రెండు సెంచరీలు సహా 62.75 సగటుతో 251 పరుగులు చేశాడు. అయితే, ఫైనల్లో అతను భారత్‌పై భారీ స్కోర్ చేయలేకపోయాడు. ఓపెనర్‌గా ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్న జాద్రాన్, ఇంగ్లాండ్‌పై 177 పరుగులు చేశాడు. ఇది టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌కావడం విశేషం. అలాగే, టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఓ సెంచరీ, మరో హాఫ్ సెంచరీ సహా 218 పరుగులు చేశాడు. ఇక టీమిండియా మిడిలార్డర్ బలమైన ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఐదు మ్యాచ్‌ల్లో 48.6 సగటుతో 243 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిందే అయ్యర్.
ఐసీసీ ప్రకటించిన జట్టులో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. 140 సగటుతో 140 పరుగులు చేశాడు. టోర్నీలో రాహుల్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 42 నాటౌట్. న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ సైతం అద్భుతంగా రాణించాడు. 177 పరుగులు చేసి రెండు వికెట్లు తీయడంతో పాటు ఐదు అధ్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 126 పరుగులు చేసి ఐదు వికెట్లు సహా ఏడు వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్సీతో పాటు బౌలింగ్‌లో కూడా బాగా రాణించాడు. 4.80 ఎకానమీ రేట్‌తో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ టోర్నమెంట్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా ఫైనల్ ఆడలేకపోయిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ అద్భుతంగా రాణించాడు. టోర్నీలో అత్యధికంగా 10 వికెట్లు పడగొట్టాడు. గ్రూప్ దశలో భారత్‌పై హెన్రీ ఐదు వికెట్లు తీశాడు. భారత్‌కు ట్రంప్ కార్డ్‌గా నిలిచిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ట్రోఫీలో వరుణ్ తొమ్మిది వికెట్లు తీశాడు. ఇక బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ని 12వ ఆటగాడి ఎంపిక చేసింది.
రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్), విరాట్ కోహ్లీ (భారత్), శ్రేయాస్ అయ్యర్ (భారత్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్-భారత్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్తాన్), మిచెల్ శాంట్నర్ (కెప్టెన్-న్యూజిలాండ్), మహమ్మద్ షమీ (భారత్), మాట్ హెన్రీ (న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ (భారత్).