Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత్ సిద్ధమైంది. ఐసీసీ ఈవెంట్లో ఎనిమిది జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. ఈ సారి చాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా సాధించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా కసితో ఉన్నది. ప్రతీ ఐసీసీ ఈవెంట్లో ఎవరో ఒక ప్లేయర్ అద్భుతాలు చేస్తూ వెలుగులోకి వచ్చిన సందర్భాలున్నాయి. ఈ సారి చాంపియన్స్ ట్రోఫీలో అందరి దృష్టి కేవలం ఐదుగురు ప్లేయర్లపైనే ఉన్నది. ఇంతకీ ఆ ప్లేయర్లలో ఎవరున్నారో ఓసారి చూసేద్దాం రండి..!
టీమిండియా గిల్‌పై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు భారత్ తరఫున 50 వన్డేల్లో ఏడు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డే ఫార్మాట్లో 60 సగటు, 101 స్ట్రయిక్ రేట్‌తో 2587 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇద్దరూ గిల్‌కు మార్గదర్శకత్వం చేయనున్నారు. 2022 నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు. 47 మ్యాచుల్లో 63.45 సగటు, 102.87 స్ట్రయిక్ రేట్‌తో 2538 పరుగులు చేశాడు.
గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐసీసీ టోర్నీల్లో బ్యాట్‌తో అద్భుతాలు సృష్టించాడు. నాకౌట్ మ్యాచ్‌లలో భారత్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. పాకిస్తాన్లో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లపై హెడ్ మరోసారి బౌలర్లపై విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా అభిమానులు వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఇప్పటికీ గుర్తుంటుంది. ప్రత్యర్థి జట్లను దెబ్బతీసే సామర్థ్యం ట్రావిస్ హెడ్‌కు ఉంది.
దాయాది దేశం పాకిస్తాన్ సల్మాన్ అఘా సగటు ఆశలు పెట్టుకుంది. ఇటీవల కాలంలో లాహోర్ బ్యాటర్ దుమ్ములేపుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలోనూ తనదైన ముద్ర వేస్తాడని టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం. దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు తొలి సెంచరీని నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాపై 350 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బ్యాట్‌తో రాణించాడు.
న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వే వన్డేల్లో ఆడింది తక్కువ మ్యాచులే. ఇప్పటి వరకు 33 మ్యాచులు మాత్రమే ఆడాడు. క్రీజులోకి వచ్చిన తక్కువ సమయంలోనే కుదురుకొని గ్యాప్‌లోకి బంతులను పంపే సత్తా ఉన్నది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ స్తాడు. పాకిస్తాన్, దుబాయిలోనైనా ఆడగల సామర్థ్యం ఉంది. ఇటీవల ఆసియా పర్యటనలతో ఇక్కడి పిచ్‌లపై అవగాహన వచ్చింది. కాన్వే రాణిస్తే న్యూజిలాండ్ పని మరింత సులువుగా మారనున్నది.
హెన్రిచ్ క్లాసెన్ ఉపఖండం పిచ్‌లపై బ్యాట్‌తో రాణిస్తాడు. అది టీ20 అయినా.. వన్డే మ్యాచ్ అయినా గమనాన్నే మార్చగల సత్తా ఉన్న ఆటగాడు. బంతిని తేలిగ్గానే బౌండరీకి తరలిస్తాడు. పాక్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ఆడిన ఓ మ్యాచ్‌లో కేవలం 56 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. మొత్తం 58 మ్యాచుల్లో 44 కంటే ఎక్కువ సగటు, 117.44 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఐసీసీ ఈవెంట్లోనూ రాణిస్తాడని దక్షిణాఫ్రికా ఆశిస్తున్నది.