సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో పరుగుల వరద పారుతున్నది. సిరీస్‌ను ఇప్పటికే దక్కించుకున్న ఆసీస్..ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. కెప్టెన్ స్టీవ్‌స్మిత్(129నాటౌట్), ట్రావిస్ హెడ్(163) సెంచరీలతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 518 పరుగులు చేసింది. స్మిత్‌తో పాటు బ్యూ వెబ్‌స్టర్(42 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 166/2తో ఆట కొనసాగించిన కంగారూలు..ఇంగ్లండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సిరీస్‌లో మంచి ఫామ్‌మీదున్న హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా బౌండరీలతో దుమ్మురేపాడు. క్రీజులో ఉన్నంతసేపు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపెట్టిన హెడ్..కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. హెడ్ ఔట్ తర్వాత ఆ బాధ్యతను భుజానేసుకున్న స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు.
తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా (17), అలెక్స్ క్యారీ (16)నిరాశపరిచినా..కామెరూన్గ్రీన్ (37), వెబ్‌స్టర్‌తో కలిసి వరుసగా ఏడు, ఎనిమిదో వికెట్‌కు 71, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చేతిలో మూడు వికెట్లు ఉన్న ఆసీస్ ప్రస్తుతం 134 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. బ్రైడన్ కార్స్ (3/108), బెన్ స్టోక్స్(2/87) ఆకట్టుకున్నారు.