న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షుడు నరిందర్ బాత్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ప్రాథమిక విచారణకు ఆదేశించింది. హాకీ ఇండియా(హెచ్ఐ)కు చెందిన రూ.35 లక్షల నిధులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదు అందింది. ఆ నిధులను వ్యక్తిగత ఖర్చులకు వినియోగించుకున్నారనే ఆరోపణలపై సీబీఐ చర్యలు మొదలుపెట్టింది.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)తో పాటు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరిందర్పై హాకీ మాజీ ఆటగాడు అస్లామ్ షేర్ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా ఉన్న నరిందర్ బాత్రా హాకీ ఇండియా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. ఎఫ్ఐహెచ్లో కీలక పదవిలో ఉన్న వ్యక్తి జాతీయ హాకీ వ్యవహారాల్లో తలదూర్చాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. హాకీ ఇండియాలో పలు నియామకాలపై అస్లామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.