Carlos Brathwaite : కార్లోస్ బ్రాత్‌వైట్.. ఈ పేరు వినగానే ఎవరికైనా 2016 పొట్టి వరల్డ్ కప్ గుర్తుకొస్తుంది. ఇంగ్లండ్‌తో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఈ ఆల్‌రౌండర్ సంచనల బ్యాటింగ్‌ను ఎవరూ మర్చిపోలేరు.. ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లతో విండీస్‌ను విశ్వ విజేతగా నిలిపి అతడు సింహ గర్జన చేయడం అభిమానుల కండ్ల ముందు మెదులుతుంది ఎవరికైనా. వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్ హీరో అయిన బ్రాత్వైట్కు పట్టలేనంత కోపమొచ్చింది. మామూలుగా ఉన్నప్పుడే బంతిని అలవోకగా స్టాండ్స్‌లోకి పంపే అతడు ఈసారి హెల్మెట్‌ను గట్టిగా కొట్టాడు.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..? మ్యాక్స్ 60 కరీబియన్ లీగ్‌లో న్యూయార్క్ స్ట్రయికర్స్(Newyork Strikers)కు ఆడుతున్నాడు. గ్రాండ్ కయ్మన్ జగౌర్స్పై అతడు 5 బంతుల్లో7 పరుగులు చేశాడు. పేసర్ జోష్ లిటిల్ వేసిన 9వ ఓవర్లో షాట్ ఆడబోయిన ఈ మాజీ హిట్టర్ మిస్ అయ్యాడు. బంతి కాస్త భుజానికి తగిలడంతో వికెట్ కీపర్ బెన్ డంక్ ఒడుపుగా అందుకొని అప్పీల్ చేశాడు. దాంతో, అంపైర్ వేలు పైకెత్తాడు. ఏంటీ? ఔటా..? అని ఆశ్చర్యపోయిన బ్రాత్‌వైట్ కోపంతో ఊగిపోయాడు.
Remember the name.. Carlos Brathwaite.. 😄pic.twitter.com/uTr7DNl0Bv
— Nibraz Ramzan (@nibraz88cricket) August 25, 2024
పెవిలియన్ వచ్చాక బ్యాట్, హెల్మెట్‌ను నేలపై విసిరేశాడు. అంతటితో ఊరుకోకుండా హెల్మెట్‌ను బంతిని కొట్టినట్టు బ్యాటుతో బలంగా బాదాడు. అది చూసిన సహాయక సిబ్బంది ఒకరు వామ్మో.. ఇదేంట్రా నాయనా అనుకుంటూ భయంతో పరుగులు తీశాడు. కరీబియన్ మాజీ ఆల్‌రౌండర్ పరాక్రమానికి ఆ హెల్మెట్ తునాతునకలైందనుకో. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రాత్‌వైట్ త్వరగానే ఔటైనా ఈ మ్యాచ్‌లో న్యూయార్క్ స్ట్రయికర్స్ 8 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.