Carlos Alcaraz | సిన్సినాటి: స్పెయిన్ నయా సంచలనం కార్లోస్ అల్కారజ్ విచక్షణ కోల్పోయాడు. ఇప్పటికే పలు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలువడం ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అల్కారజ్ ఓడిన కోపంలో రాకెట్‌ను నేలకేసి బలంగా కొట్టాడు. వర్షం అంతరాయం కారణంగా వాయిదాతో శుక్రవారం జరిగిన పోరులో అల్కారజ్ 6-4, 6-7(5-7), 4-6తో గేల్ మోనోఫిల్స్(ఫ్రాన్స్) చేతిలో అనూహ్య ఓటమి చవిచూశాడు. తొలి సెట్‌ను 6-4తో గెలుచుకున్న ఈ స్పెయిన్ స్టార్..వరుసగా రెండు సెట్లను మోనోఫిల్స్కు చేజార్చుకున్నాడు.
ఈ క్రమంలో కోపాన్ని అణుచుకోలేకపోయిన అల్కారజ్ రాకెట్‌ను ముక్కలయ్యే వరకు బాదాడు. ‘ఇప్పటి వరకు నా కెరీర్లో చెత్త మ్యాచ్. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయాను. ఇదంతా మరిచిపోయి యూఎస్ ఓపెన్ కోసం న్యూయార్క్ బయల్దేరి వెళ్లాలి’ అని అన్నాడు. మోనోఫిల్స్తో మ్యాచ్‌లో అలా వ్యవహరించడంపై అల్కారజ్ క్షమాపణలు చెప్పాడు.