Carlos Alcaraz : పారిస్ ఒలింపిక్ హీరో కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)కు షాక్ తగిలింది. టైటిల్ విజేతగా యూఎస్ ఓపెన్ (US Open 2024)లో అడుగుపెట్టాలనుకున్న స్పెయిన్ కెరటానికి నిరాశే మిగిలింది. మూడో సీడ్ అయిన అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్ (Cincinnati Open) 32వ రౌండ్లోనే అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. దాంతో, కోపాన్ని నిగ్రహించుకోలేక రాకెట్‌ను విరగ్గొట్టాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన అల్కరాజ్ సిన్సినాటి ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే.. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మొన్ఫిల్స్(Gael Monfils) అతడికి గట్టి పోటీ ఇచ్చాడు. బలమైన షాట్లతో చెలరేగిన మొన్ఫిల్స్ వరుసగా ఆఖరి రెండు సెట్లు గెలిచాడు. ఓవైపు మ్యాచ్ చేజారుతున్న బాధ.. మరోవైపు కీలక సమయంలో బ్రేక్ పాయింట్ సాధించడంలో అల్కరాజ్ విఫలమయ్యాడు.
“He desperately wants to win this match” 👀#CincyTennis pic.twitter.com/QkiDhvNHtw
— Tennis TV (@TennisTV) August 16, 2024
దాంతో, కోపంతో ఊగిపోయిన అతడు రాకెట్‌ను గట్టిగా నేలకేసి కొట్టాడు. అంతే అది విరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ తొలి సెట్ గెలుపొందినా 6-4, 6-7, 4-6తో ఇంటి దారి పట్టాడు. ‘కెరీర్లో నేను ఆడిన చెత్త మ్యాచ్ ఇది. నేను చాలా బాగా సాధన చేస్తున్నా. చాలా బాగా ఆడుతున్నా. కానీ, మ్యాచ్ గెలవలేకపోయా. ఈ ఓటమిని మర్చిపోయి ఆత్మవిశ్వాసంతో యూఎస్ ఓపెన్ కోసం న్యూయార్క్‌కు వెళ్తాను’ అని మ్యాచ్ అనంతరం అల్కరాజ్ అన్నాడు.