పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ అదరగొడుతున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ 6-1, 4-6, 6-1, 6-2తో ఫాబియన్ మరోజాన్ (హంగరీ)పై గెలిచి మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రెండు గంటల పాటు సాగిన పోరులో అల్కరాజ్ ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచాడు.
ఈ క్రమంలో తొలి సెట్‌ను అలవోకగా గెలిచిన అల్కరాజ్కు రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో చెలరేగిన మరోజాన్ సెట్ గెలిచి పోటీలోకి వచ్చాడు. అయితే వెంటనే తేరుకున్న అల్కరాజ్..ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తు వేస్తూ వరుస పాయింట్లు కొల్లగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో ఐదు ఏస్‌లు, ఒక డబుల్ ఫాల్ట్ చేసిన అల్కరాజ్ 25 అనవసర తప్పిదాలు చేశాడు. మరో పోరులో కాస్పర్ రూడ్ 6-2, 4-6, 1-6, 0-6తో నునో బోర్డెస్ చేతిలో ఓడాడు.