IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ ఆఖరి ఘట్టం ఆదివారమే. చెపాక్ వేదికగా జరిగే అంతిమ సమరంలో ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్‌మనీ అందుకునే విజేత ఎవరు? అని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. బెట్టింగ్‌కు భారీ అవకాశమున్న ఈ మ్యాచ్‌పై సెలబ్రిటీల కన్ను పడింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై భారీగా పందేలు కాసే కెనడా ర్యాపర్, సంగీతకారుడు డ్రేక్ గ్రాహం(Drake Graham)
ఈసారి ఐపీఎల్ విజేతను ఊహిస్తూ బెట్టింగ్‌కు సిద్ధమయ్యాడు.
టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) గెలుస్తుందని డ్రేక్ ఏకంగా రూ.2 కోట్ల పందెం కాశాడు. ఒకవేళ అతడి అంచనా నిజమైతే రూ.4 కోట్లు సంపాదించే చాన్స్ ఉంది. అయితే.. గతంలో డ్రేక్ పందెం కాసి చేతులు కాల్చుకున్నాడు. దాంతో, ఈసారి కూడా అదే జరుగుతుందని కొందరు అనుకుంటున్నారు.
డ్రేక్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కోల్‌కతాపై రూ.2 కోట్ల పందెం కాశాడు. ‘ఫేవరేట్ టీమ్ వెనుదిరిగింది. సో నేను క్రికెట్లో తొలిసారి కోల్‌కతాపై బెట్టింగ్ కాస్తున్నా’ అని అతడు రాసుకొచ్చాడు. డ్రేక్ అంచనాలు పలుమార్లు తప్పిన సందర్బాలు లేకపోలేదు. ఫిఫా వరల్డ్ కప్‌తో మొదలు ఇతర సాకర్ మ్యాచుల్లో డ్రేక్ పందెం కాసి భారీ మొత్తం పోగొట్టుకున్నాడు.
పదిహేడో సీజన్లో కోల్‌కతా జట్టు నిలకడగా రాణిస్తూ 9 విజయాలో టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వాలిఫయర్ 1 లో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగడంతో కమిన్స్ సేన స్వల్ప స్కోర్‌కే పరిమితమై మ్యాచ్ చేజార్చుకుంది. అనంతరం చెపాక్‌లో జరిగిన క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్‌కు చెక్ పెట్టి ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పిన్నర్లకు స్వర్గధామమైన చెపాక్ స్టేడియంలో మే 26 ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది. దాంతో, కోల్‌కతా మూడో టైటిల్ అందుకుంటుందా? లేదా ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో రెండో ట్రోఫీ చేరుతుందా? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.