వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ఇండియా నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే సెమీస్‌కు చేరిన రోహిత్ సేన విజయాల జోరు కొనసాగించాలని చూస్తుంటే.. ఈ టోర్నీలో అంచనాలకు మించి రాణించి రెండు విజయాలు ఖాతాలో వేసుకున్న నెదర్లాండ్స్ మరో సంచలనం నమోదు చేయాలని తహతహలాడుతున్నది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడం ఖయామైన నేపథ్యంలో.. డచ్ జట్టుతో పోరును మనవాళ్లు రిహార్సల్‌గా వినియోగించుకోవాలని చూస్తున్నారు. భారీ స్కోర్లకు నెలవైన బెంగళూరులో దీపావళి నాడు కింగ్ కోహ్లీ 50వ వన్డే సెంచరీ నమోదు చేసుకుంటాడా చూడాలి!
Cricket World Cup | బెంగళూరు: స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ప్రత్యర్థులందరినీ చిత్తు చేసి అజేయంగా నిలిచిన భారత్.. ఆదివారం టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొంటున్నది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రోహిత్ సేన.. బుధవారం తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుండగా.. దానికి ముందు బెంగళూరులో నేడు డచ్ జట్టుతో పోరుకు సిద్ధమైంది. విరాట్ కోహ్లీకి సొంతమైదానం లాంటి చిన్నస్వామి స్టేడియంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల (49) రికార్డును అధిగమించాలని యావత్ భారతావని ఆశిస్తోంది.
పండుగ పూట కోహ్లీ ఆ ఫీట్ సాధిస్తే.. అది మరింత మధురంగా మారడం ఖాయమే. టీమ్ పరంగా భారత్‌కు పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. తుది జట్టులో ఎలాంటి మార్పులకు అవకాశం లేదు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మంచి టచ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, షమీ దుమ్మురేపుతున్నారు. గత మ్యాచ్‌ల్లో మహామహా జట్లనే వణికించిన భారత బౌలింగ్‌ను డచ్ ప్లేయర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీపై భారీ అంచనాలు ఉండగా.. ఐపీఎల్లో తన హోం గ్రౌండ్ అయిన బెంగళూరులో అతడికి అభిమానుల నుంచి మస్తు మద్దతు లభించనుంది.
ఇక నాకౌట్ మ్యాచ్‌లకు ముందు సూర్యకుమార్ యాదవ్ నుంచి కూడా భారీ ఇన్నింగ్స్ వస్తే.. మేనేజ్మెంట్ బెంగ తీరినట్లే. ఈ టోర్నీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సూర్య 21.25 సగటుతో 85 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా వంటి పెద్ద జట్టుపై విజయంతో టోర్నీలో ప్రకంపనలు రేకెత్తించిన నెదర్లాండ్స్ ఆ తర్వాత అదే తీవ్రత కొనసాగించలేకపోయింది. బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలిచింది. చాంపియన్స్ ట్రోఫీ (2025)కి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో భారత్‌పై తప్పనిసరిగా గెలువాల్సిన పరిస్థితుల్లో నెదర్లాండ్స్ బరిలోకి దిగుతున్నది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌తో పాటు అకెర్మన్, వాన్ బీక్, బాస్ డీ లీడ్, మీకెరెన్పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు తుది జట్టులో ఉండటం ఖాయమే.
బెంగళూరు పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. భారీ స్కోర్లు ఖాయమే. ఇక్కడ జరిగిన గత రెండు మ్యా చ్ల్లో తొలుత బ్యాటిం గ్ చేసి న జట్లు వరుసగా 367, 401 పరుగులు చేశా యి. మ్యాచ్ కు వర్ష సూ చన లేదు.
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు భారత్, నెదర్లాండ్స్ మధ్య రెండు (2003, 2011) మ్యాచ్‌లు జరగగా.. రెండింట టీమ్ఇండియా విజయం సాధించింది. 2003 మెగాటోర్నీలో తన బౌలింగ్‌తో టీమ్ఇండియాను వణికించి నాలుగు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన టిమ్ డీ లీడ్ కొడుకు బాస్ డీ లీడ్ ప్రస్తుత జట్టులో సభ్యుడిగా ఉండటం విశేషం