Cameron Green : వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడైన యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green) ఐపీఎల్ 17వ సీజన్‌కు సన్నద్ధమవుతున్నాడు. మినీ వేలానికి ముందు ట్రేడింగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్(Mubai Indians) నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)కు మారిన ఈ యంగ్‌స్టర్ తాజాగా తన జీవితంలోని షాకింగ్ విషయాలను వెల్లడించాడు. తనకు పుట్టుకతోనే మూత్రపిండాల సమస్య(Chronic Kidney Disease) ఉందని, 12 ఏండ్లు మాత్రమే బతుకుతానని డాక్టర్లు చెప్పారని గ్రీన్ తెలిపాడు.
‘పుట్టుకతోనే నాకు తీవ్రమైన మూత్రపిండాల సమస్య ఉంది. కిడ్నీలు 60 శాతం దెబ్బతిన్నాయి. అయితే.. అదృష్టవశాత్తూ అది రెండో దశలో ఉంది. అయితే.. మొదట్లో కిడ్నీలు మెరుగుపడలేదు. ఎందుకంటే దాన్ని మనం మార్చలేం. ఒకదశలో నేను 12 ఏండ్లు మాత్రమే బతుకుతానని డాక్టర్లు చెప్పారు’ అని తమ దేశానికి చెందిన 7 క్రికెట్ మీడియాతో గ్రీన్ వెల్లడించాడు.
కామెరూన్ గ్రీన్
అంతేకాదు మెరుగైన వైద్యం, తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోయి ఉంటే మూత్రపిండాల సమస్య మరింత తీవ్రమయ్యేదని, తాను బతికేవాడినే కాదని 24 ఏండ్ల గ్రీన్ చెప్పుకొచ్చాడు. భారత గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న గ్రీన్ ఐపీఎల్ 16వ సీజన్ మినీ వేలంలో గ్రీన్ కోట్లు కొల్లగొట్టాడు. ఈ యువ ఆల్‌రౌండర్‌ను ముంబై ఇండియన్స్ రూ.17.50 కోట్లకు కొన్నది. అయితే.. ఆరంభంలో విఫలమైన గ్రీన్ ఆ తర్వాత రెచ్చిపోయాడు.
ఐపీఎల్లో తొలి సెంచరీ కొట్టాక గ్రీన్ సంబురం
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక పోరులో ఈ యంగ్‌స్టర్ సెంచరీతో సత్తా చాటాడు. ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. 16వ సీజన్లో గ్రీన్ 160.3 స్ట్రైక్ రేటుతో 452 రన్స్ కొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 22 సిక్సర్లు, 44 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు బంతితోనూ రాణించి 6 వికెట్లు పడగొట్టాడు.