బసెల్ : రెండ్రోజుల క్రితమే ముగిసిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వైఫల్య ప్రదర్శన చేసిన భారత షట్లర్లు తిరిగి పుంజుకునేందుకు మరో టోర్నీ సిద్ధమైంది. మంగళవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నమెంట్ (స్విస్ ఓపెన్) మొదలుకానుంది. 2019లో ఇక్కడే జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలలో బంగారు పతకం గెలిచిన డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. స్విస్ ఓపెన్ ద్వారా మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని భావిస్తోంది. సింధుతో పాటు మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ బరిలో ఉన్నారు. సింధు తొలి రౌండ్లో మాళవికతో పోటీ పడనుంది. సింధు మాదిరిగానే ఇక్కడ మంచి రికార్డు కలిగిన హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్, కిడాంబి శ్రీకాంత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.