భూపాలపల్లి రూరల్, మార్చి 2 : బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మరోమారు సత్తాచాటారు. రాజకీయాల్లోనే కాదు..అథ్లెటిక్స్‌లోనూ తనకు తిరుగులేదని చాటిచెప్పారు. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన 42కిలోమీటర్ల సుదీర్ఘ మారథాన్‌లో బరిలోకి దిగిన జ్యోతి పతకంతో మెరిశారు. వయసును లెక్కచేయకుండా పోటీపడ్డ ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఆరు గంటల్లో పూర్తి చేసి ఔరా అనిపించారు. టోక్యోతో పాటు ప్రపంచంలో ప్రముఖ మారథాన్లుగా పేరొందిన బోస్టన్, బెర్లిన్, చికాగో, న్యూయార్క్, లండన్‌లోనూ జ్యోతి పతకాలు కొల్లగొట్టడం విశేషం. తన భార్య పతకాలు సాధించడం పట్ల భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.