Paralympics 2024 : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఏడు నెలల గర్భవతి (Pregnant) అయిన పారా ఆర్చర్ జోడీ గ్రిన్‌హమ్(Jodie Grinham) పతకంతో మెరిసింది. బ్రిటన్‌కు చెందిన ఆమె మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే పట్టుదలతో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్‌లో మెడల్ కొల్లగొట్టిన గర్భిణిగా జోడీ చరిత్ర సృష్టించింది. ‘కడుపులో కలల పంటను మోస్తూనే పోడియం మీద నిల్చోవడం చాలా సంతోషంగా ఉంద’ని బ్రిటన్ ఆర్చర్ తెలిపింది. పారాలింపిక్స్‌లో ఆమెకు ఇది రెండో పతకం కావడం విశేషం.
ఆదివారం జరిగిన కాంస్య పోరులో జోడీకి అసలైన సవాల్ ఎదురైంది. ఎందుకంటే.. టోక్యోలో పసిడితో రికార్డు నెలకొల్పిన ఫొబే పాటెర్సన్తో ఆమె తలపడింది. అయినా సరే ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వని జోడీ గురి పెట్టి బాణాలు సంధించింది. చివరకు ఒకే ఒక పాయింట్ తేడాతో ఫొబేకు షాకిచ్చింది. 142-141తో గెలుపొందిన జోడీ కాంస్యంతో మురిసిపోయింది.
జోడీ గ్రిన్‌హమ్
ఇంగ్లండ్‌లోని వేల్స్లో జోడీ జన్మించింది. ఆమెకు పుట్టుకతోనే బ్రాకీసిండాక్టిలీ అనే సమస్య ఉంది. దాని కారణంగా ఆమె శరీరంలో ఎడమ భాగం సరిగ్గా పనిచేయదు. అంతేకాదు జోడీ ఎడమ చేయి సగమే ఉంది. ఎడమ భుజం కూడా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. అయినా సరే ఆమె కుంగిపోలేదు. వైకల్యాన్ని నిందిస్తూ కూర్చోకుండా 2008లో పట్టుదలగా ఆర్చరీ వైపు అడుగులేసింది.
అందరిలా చేతులు సహకరించే పరిస్థితి కాదు ఆమెది. అందుకని జోడీ తన కుడిచేతితోనే ఆర్చరీ సాధన చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. అందుకని బాణాలను ఆమె అందరిలా నడుముకు కాకుండా గర్భంలోని బిడ్డకు ఇబ్బంది కలగకుండా కుడి కాలు తొడ భాగంలో అమర్చుకుంది. చెక్కు చెదరని గురితో కాంస్యం కొల్లగొట్టింది. వైకల్యాన్ని ఆయుధంగా మలుచుకున్న జోడీ 2016 పారిలింపిక్స్లో రజతం గెలుపొందింది.