డెహ్రాడూన్: బీజేపీ నేత ఒక బాలికను లైంగికంగా వేధించాడు. అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ బీజేపీ నేతను అరెస్ట్ చేశారు. (BJP leader Arrest) ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 24న సోదరులతో కలిసి మేకలు మేపేందుకు వెళ్లిన 14 ఏళ్ల కుమార్తెకు బీజేపీ బ్లాక్ అధ్యక్షుడు భగవత్ సింగ్ బోరా చాకెట్లు ఇచ్చాడని, బాలికను లైంగికంగా వేధించాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె తల్లి ఆరోపించింది. ఆగస్ట్ 30న పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.
కాగా, కోర్టు, వైద్యులు, శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట ఆ బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత భగవత్ సింగ్ బోరాపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆయనను శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు ఈ సంఘటన దురదృష్టకరమని బీజేపీ పేర్కొంది. భగవత్ సింగ్ బోరాను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వెల్లడించింది. ‘పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి నిందితుడ్ని తొలగించాం. మహిళలపై నేరాల విషయంలో మా ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తోంది’ అని ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ అన్నారు.