న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత రెజ్లర్లు తమకు న్యాయం జరుగాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఓవైపు వాతావరణ పరిస్థితులు ప్రతిబంధకంగా మారినా వెనుకకు తగ్గకుండా నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం జంతర్‌మంతర్ ప్రాంతంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసినా కుస్తీవీరులు తమ పోరాటపంథాను వీడలేదు. తమను లైంగికంగా వేధించిన జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు శిక్ష పడే వరకు విశ్రమించేది లేదని రెజ్లర్లు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రెజర్లు చేస్తున్న న్యాయసమ్మతమైన పోరాటానికి పలు రాజకీయ పార్టీలకు తోడు కాప్ పంచాయతీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మద్దతు పలుకుతున్నారు. ‘మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. వర్షం పడినా..వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారినా నిరసన విరమించం. తడిసిన పరుపులపై కూడా నిద్రపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. మరో రెండు రోజులు ఇలాంటి వాతావరణం ఉన్నా..అవరోధాలను ఎదుర్కొంటాం. ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేం’ అని బజరంగ్పునియా అన్నాడు.