Neymar Jr : బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్ జూనియర్(Neymar Jr) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. గర్భంతో ఉన్న ప్రేయసి బ్రునా బియన్కర్డి(Bruna Biancardi)తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు తన గర్ల్‌ఫ్రెండ్‌కు అతను క్షమాపణలు కూడా చెప్పాడు. ఎందుకో తెలుసా..? నెయ్మర్ ఆమెను మోసం చేస్తున్నట్టు ఆన్లైన్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. అవన్నీ నిజం కాదని, తామిద్దరం కలిసే ఉన్నామని ఈ ఫార్డర్డ్ ఆటగాడు తెలిపాడు.
‘బ్రూ.. నేను చేసిన పొరపాటును మన్నించాలని ఇంతకుముందే నిన్ను అడిగాను. అనవరమైన ప్రచారం కోసం అదంతా చేశాను. ఇప్పుడు అందరి ముందు మరొకసారి క్షమాపణ అడుగుతున్నా’ అని నెయ్మార్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
గర్ల్‌ఫ్రెండ్ బ్రూనాతో నెయ్మర్
నెయ్మర్ ప్రస్తుతం పీఎస్జీ క్లబ్‌కు ఆడుతున్నాడు. వచ్చే సీజన్లో అతను కొత్త క్లబ్‌కు వెళ్లనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ క్లబ్ నెయ్‌మర్‌ను దక్కించుకోవాలని చూస్తోంది. ఎందుకంటే..? మొదట ఈ క్లబ్ యాజమాన్యం.. లియోనల్ మెస్సీతో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయత్నించింది. కానీ, అతను అమెరికాకు చెందిన ఇంటర్ మియామికి ఓకే చెప్పాడు. దాంతో, ఎలాగైనా సరే నెయ్‌మర్‌ను సొంతం చేసుకోవాలని అల్ హిలాల్ టీమ్ పావులు కదుపుతోంది.